మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. త్వరలో మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నారనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాలతో పాటు టెలివిజన్ షోలకు కూడా చిరంజీవి గతంలో హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.చిరంజీవి గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. మరోవైపు సీనియర్ హీరోల్లో నాగార్జున ‘బిగ్‌బాస్’కు హోస్ట్‌గా కొనసాగుతుండగా, బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా మరోసారి టాక్ షో లేదా పాడ్‌కాస్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రచయిత బీవీఎస్ రవి, చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల కలిసి ఓ ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ షో కాన్సెప్ట్‌ను చిరంజీవి వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ చిరంజీవికి నచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు చిరంజీవి లేదా ఆయన కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇప్పటికే స్థానిక భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు వివిధ రకాల వినోద కార్యక్రమాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ కార్యక్రమం రూపొందించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ పాడ్‌కాస్ట్ కార్యక్రమం తెరకెక్కితే.. సాధారణ టాక్ షోలకు భిన్నంగా ఉండేలా కాన్సెప్ట్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సినీ ప్రయాణం, ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ నటీనటుల అనుభవాలు, చిత్ర పరిశ్రమలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు, షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, కెరీర్‌లోని కీలక మలుపులు వంటి అంశాలను ఇందులో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ముఖ్యంగా చిరంజీవితో కలిసి పనిచేసిన పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను కార్యక్రమానికి ఆహ్వానించి.. వారి అనుభవాలను ప్రేక్షకులతో పంచుకునేలా షోను రూపొందించే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ పాడ్‌కాస్ట్ నిజంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? నెట్‌ఫ్లిక్స్ దీనిని అధికారికంగా నిర్మిస్తుందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. చిరంజీవి నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


