‘ది పారడైజ్’ ప్రీమియర్‌పై నాని విజ్ఞప్తి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Must read

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది పారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా ప్రీమియర్ షో వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని నాని పేర్కొన్నారు. ‘ది పారడైజ్’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ నాని తన విజ్ఞప్తిని వెల్లడించారు.

సినిమాలను ప్రేక్షకుల కోసమే రూపొందిస్తామని నాని పేర్కొన్నారు. అలాంటి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తూ వారి స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడం నటుడిగా తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. చిన్నప్పటి నుంచే సినిమాలను అభిమానించే వ్యక్తిగా థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమా చూడాలన్నది తన కోరికగా పేర్కొన్నారు.అయితే తన థియేటర్ సందర్శన సమయంలో అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. ప్రేక్షకుల భద్రత కూడా తమకు అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన విజ్ఞప్తిని పరిశీలించాలని సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, సంబంధిత పోలీసు అధికారులను నాని కోరారు.

నాని చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ నాని వ్యవహరిస్తున్న తీరాన్ని సీఎం అభినందించారు. తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రంపై నాని చూపిస్తున్న నిబద్ధతను కూడా ప్రశంసించారు.అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు నాని అధికారిక ప్రక్రియను అనుసరించాలని సీఎం సూచించారు. భారీగా ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దీని సక్రమంగా నిర్వహించడం, ప్రజల భద్రతను నిర్ధారించడం కోసం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు సమర్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు.నాని నుంచి వచ్చే దరఖాస్తును సంబంధిత పోలీసు అధికారులు పరిశీలించి, పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటారని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు తెలంగాణ డీజీపీని కూడా సీఎం తన స్పందనలో ట్యాగ్ చేశారు.
ఇదిలా ఉండగా, ‘ది పారడైజ్’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీమియర్ షో సందర్భంగా నాని స్వయంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా వీక్షిస్తారా లేదా అనేది అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!