బీజేపీ కార్యక్రమాలకు అంజిరెడ్డి ఎందుకు దూరంగా ఉంటున్నారు?.. తెరపైకి వస్తున్న కొత్త చర్చ

Must read

బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి వ్యవహారశైలి ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లాలో బీజేపీ నిర్వహిస్తున్న కొన్ని కీలక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం, అదే సమయంలో ఇతర పార్టీల నేతలతో కలిసి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ.. జిల్లా బయట జరిగే పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారనే చర్చ కూడా వినిపిస్తోంది.

చిన్నమైల్ అంజిరెడ్డి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఆయన సొంత ప్రాంతం. అయితే కొంతకాలంగా జిల్లాలో జరిగే బీజేపీ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంపై స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.ఆగస్టు 31న సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట 22ఏ భూముల అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

అదే అంశంపై సెప్టెంబర్ 2న నర్సాపూర్‌లో కూడా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. కానీ అంజిరెడ్డి అక్కడ కూడా కనిపించలేదు. దీంతో వరుసగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటంపై స్థానిక బీజేపీ శ్రేణుల్లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 5న పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో 22ఏ భూముల బాధిత కుటుంబాలతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. సుమారు 1,500 బాధిత కుటుంబాలతో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా అంజిరెడ్డి హాజరుకాలేదు. ముఖ్యంగా ఇది తనకు సంబంధించిన ప్రాంతంలో జరిగిన కార్యక్రమం కావడంతో ఈ గైర్హాజరు మరింత చర్చకు దారితీసింది.

అదే రోజు బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద 22ఏ భూముల అంశంపై నిర్వహించిన మహాధర్నాకు మాత్రం అంజిరెడ్డి హాజరయ్యారు. దీంతో సొంత జిల్లాలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్?

మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అంజిరెడ్డి.. ఇతర పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం కూడా చర్చకు కారణమవుతోంది. పటాన్‌చెరు ప్రాంతంలో నిర్వహించిన పొల్యూషన్ ఫ్రీ రన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అంజిరెడ్డి పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హాజరైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

దీంతో బీజేపీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇతర పార్టీల నేతలతో జరిగే ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రం ఎందుకు హాజరవుతున్నారు? అనే ప్రశ్నలు పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

రఘునందన్ రావుతో విభేదాలే కారణమా?

అంజిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో ఉన్న విభేదాలే కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇద్దరు నేతల నుంచి స్పష్టమైన అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో మెదక్ ఎంపీ టికెట్ కోసం అంజిరెడ్డి, రఘునందన్ రావు పోటీ పడ్డారనే విషయం బీజేపీ వర్గాల్లో చర్చకు వచ్చింది. చివరకు పార్టీ టికెట్ రఘునందన్ రావుకు దక్కగా, ఆయన ఎంపీగా విజయం సాధించారు. అనంతరం అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందారు.

అయితే ఈ పరిణామాల తర్వాత కూడా ఇద్దరి మధ్య రాజకీయ దూరం కొనసాగుతోందనే ప్రచారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రఘునందన్ రావు ఆధ్వర్యంలో జరిగే కొన్ని కార్యక్రమాలకు అంజిరెడ్డి దూరంగా ఉంటున్నారనే చర్చ దీనికి మరింత బలం చేకూరుస్తోందని పార్టీ వర్గాల్లో విశ్లేషణ వినిపిస్తోంది.

కార్యకర్తల్లో అసంతృప్తి?

నేతల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నా వాటి ప్రభావం పార్టీ కార్యక్రమాలపై పడకూడదనే అభిప్రాయం బీజేపీ కేడర్‌లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కీలక నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి రఘునందన్ రావు కీలక నేతగా ఉన్నారని, ఆయనతో కలిసి పనిచేయడం పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అంజిరెడ్డి కూడా ఎమ్మెల్సీగా తన పరిధిలో పార్టీకి మరింత బలం చేకూర్చేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే చర్చ ఉంది.

వ్యక్తిగత విభేదాలు, రాజకీయ భేదాభిప్రాయాలు ఉంటే నేతలు తమ స్థాయిలో పరిష్కరించుకోవాలని.. వాటి ప్రభావం పార్టీపై పడకుండా చూడాలని కేడర్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి వ్యవహారశైలిపై జరుగుతున్న చర్చకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏమైనా స్పందిస్తుందా? ఉమ్మడి మెదక్ జిల్లాలో నేతల మధ్య సమన్వయం కోసం ఏదైనా చర్యలు తీసుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!