దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

Must read

Road Accident In Jharkhand : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజరప్ప ఆలయ దర్శనానికి భక్తులతో వెళ్తున్న స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైంది. రాంచీ-పట్నా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో రాంచీ-పట్నా జాతీయ రహదారి (NH-33)పై ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బిహార్‌లోని నలంద జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియో వాహనంలో రాజరప్ప ఆలయానికి బయలుదేరారు. మార్గంమధ్యలో బీజేపీ కార్యాలయం సమీపంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మరో వ్యక్తి గాయపడటంతో స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా దెబ్బతిన్న వాహనం నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం రామ్‌గఢ్‌ సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. వాహనం ఏ విధంగా ప్రమాదానికి గురైందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన 13 మంది మృత్యువాత పడటంతో బిహార్‌లోని నలంద జిల్లా జంఘారో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article