Regional Ring Road: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగం పనుల్లో వేగం పెరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. షాద్నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 28 గ్రామాల్లో మొత్తం 75.67 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం 1,869.30 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో షాద్నగర్ డివిజన్లోనే 12 గ్రామాలు ఉండగా, మిగిలినవి కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్ల పరిధిలోకి వస్తాయి. శనివారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయనుండగా, వచ్చే ఏడాది మార్చిలోపు భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి, అవసరమైన చోట పడావు, పట్టా భూములను తీసుకుంటారు. అదే సమయంలో హెచ్ఎండీఏ అధికారులు తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను సమాంతరంగా రూపొందించనున్నారు.
మూడు దశల్లో భూసేకరణ.. రైతుల అభ్యంతరాలకు అవకాశం:
సేకరించనున్న 1,869.30 ఎకరాల భూములను మూడు దశల్లో చేపట్టేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత 28 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, భూయజమానులు(Regional Ring Road), స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. రెండో దశలో సర్వే నిర్వహించి, అభ్యంతరాలను పరిశీలించి, చర్చల అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసి అవార్డు ప్రకటిస్తారు. మూడో దశలో పరిహారం పంపిణీ ప్రక్రియ చేపట్టి, ఆర్డీవో కార్యాలయం ద్వారా నగదు చెల్లిస్తారు; పరిహారం తీసుకోని వారి మొత్తాన్ని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు.
రెండు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ బలోపేతం:
దక్షిణ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో రెండు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల అనుసంధానం కీలకంగా మారింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొంగరకలాన్–ఆమనగల్లు మధ్య 42 కిలోమీటర్ల రతన్ టాటా రేడియల్ రోడ్డు-1, బుద్వేల్–కొడంగల్ మధ్య 81 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 నిర్మించనున్నారు. వీటి ద్వారా ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, భారత్ ఫ్యూచర్ సిటీ, దక్షిణ ప్రాంత గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.




