- జగ్గారెడ్డి ఆహ్వానం.. హరీశ్ రావు రాకతో ఆసక్తికర పరిణామం
- 21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి వెళ్లిన హరీశ్ రావు
- రాజకీయంగా పడదు.. అయినా పెళ్లికి జగ్గారెడ్డి పిలవడంపై చర్చ
Harish Rao-Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధాలు కొత్త కాదు.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. కానీ, రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు కూడా ఉంటాయని గుర్తుచేసే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి..
తాజాగా జగ్గారెడ్డి కుమారుడి వివాహ వేడుక అలాంటి చర్చకే వేదికైంది.. 21 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ముఖాముఖి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది..
జగ్గారెడ్డి ఆహ్వానం.. హరీష్ రావు రాక :
జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి వివాహం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డితో (Harish Rao-Jagga Reddy) పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం హరీశ్ రావు రావడమే.. జగ్గారెడ్డి స్వయంగా ఆహ్వానించడంతో హరీశ్ రావు పెళ్లికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హరీశ్ రావును ఆహ్వానించడానికి జగ్గారెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. నవంబర్ 15న హైదరాబాద్‌లోని హరీశ్ ఇంటికి వెళ్లి పెళ్లి పత్రిక కూడా అందించారు. ఈ సందర్భంగా 2004 నాటి రోజులను ఇద్దరూ గుర్తుచేసుకున్నారు..
2004లో పరిచయం.. 2026లో మళ్లీ కలయిక :
2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని జగ్గారెడ్డి చెప్పారు.. అప్పట్లో ప్రతిరోజూ హరీశ్ చాంబర్లోనే టిఫిన్, భోజనం చేసేవాడినని గుర్తుచేశారు. ఆ తర్వాత రాజకీయంగా పార్టీలు మారడంతో ఇద్దరి మధ్య కలయికలు తగ్గిపోయాయి.. మధ్యలో ఒకసారి జరిగిన సన్మానాన్ని మినహాయిస్తే వ్యక్తిగతంగా కలుసుకోలేదని వివరించారు..
తన కుమార్తె పెళ్లికి హరీశ్‌ను పిలవలేకపోయానని, ఇప్పుడు కుమారుడి వేడుకకు ఆహ్వానించానని చెప్పారు. అంతేకాదు.. హరీశ్ రావు బీఆర్ఎస్ టాప్ లీడర్ అని సరదాగా వ్యాఖ్యానించారు. తమ మధ్య జరిగిన ఈ కలయికకు రాజకీయ కోణం లేదని కూడా స్పష్టం చేశారు..
రేవంత్‌తో సన్నిహితం.. హరీశ్‌కు ఆహ్వానం :
ఇక్కడే అసలు ఆసక్తికరమైన అంశం.. ప్రస్తుతం జగ్గారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. జగ్గారెడ్డి కుమార్తె వివాహానికి కూడా రేవంత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు..
మరోవైపు రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తోంది. సిద్ధిపేట సభలో హరీశ్‌ను ఓడించాలని రేవంత్ పిలుపునివ్వడం, దమ్ముంటే తనపై పోటీ చేయాలని హరీశ్ సవాల్ చేయడం తెలిసిందే..
ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి ఇద్దరినీ తన కుటుంబ వేడుకకు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.. అయితే, దీన్ని రాజకీయ సమీకరణాల మార్పుగా చెప్పలేం.. ఎందుకంటే.. జగ్గారెడ్డి చెప్పినట్టుగానే ఇది పాత పరిచయం, వ్యక్తిగత అనుబంధానికి సంబంధించిన వ్యవహారంగా కనిపిస్తోంది..
రాజకీయంగా ఎవరికి వారు ప్రత్యర్థులైనా, కుటుంబ వేడుకల దగ్గర పాత పరిచయాలకు విలువ ఇవ్వడం మంచి విషయమే.. అందుకే ఈ కలయిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది..




