Vijay Sethupathi : తమిళ్ స్టార్ హీరో విజయ్ సీఎం అయిన తర్వాత తమిళ నటీనటులంతా రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయాల గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా రాజకీయాల గురించి మాట్లాడాడు. విజయ్ సేతుపతి, శృతి హాసన్ నటించిన ట్రైన్ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి, తను చేసే సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు విజయ్ సేతుపతి.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ నాకు నటుడిగానే తెలుసు. ఆయన చేసే రాజకీయ కార్యక్రమాలను నేను అంతగా గమనించను. సినిమా వాళ్ళు రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయడం తప్పు కాదు కానీ ఏదైనా అంశంపై స్పందించే ముందు దాన్ని గమనించి, పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడాలి. సరైన అవగాహన లేకుండా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా వెళ్తాయి. రాజకీయ వ్యాఖ్యల ద్వారా విమర్శలు వచ్చి నటీనటులు నటించే సినిమాలపై ప్రభావం చూపెట్టకూడదు. రాజకీయాలు అనేవి వ్యక్తిగత ఆశయాల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండాలి అని అన్నారు.
అలాగే.. నా సంస్థ ద్వారా దాదాపు రెండు లక్షల మందికి ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించాము. కొంతమందికి ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేసాము. ఒక చెరువును శుభ్రపరిచాము.. ఇంకా కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. నేను సంపాదించిన డబ్బును ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం సంతృప్తి ఇస్తుంది. నా శక్తి మేరకు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అన్నారు.




