- AI దెబ్బకు వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం
- 10 వేల మందిని తొలగించేందుకు SAP సిద్ధం
- ఉద్యోగుల సంఖ్య తగ్గించనున్న సాఫ్ట్వేర్ దిగ్గజం
SAP Layoffs : ఏఐ దెబ్బకు టెక్కీల ఉద్యోగాలు ఊడిపోతున్నాయ్.. ఎప్పుడు ఎవరికి ఎసరు పడుతుందో తెలియని పరిస్థితి.. టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావమే దీనికి కారణం.. ప్రతి కంపెనీ ఏఐతో ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి.. ఇప్పటికే చాలా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐ పేరుతో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి..
చాలా కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటుండగా, ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ SAP కూడా భారీ మార్పులకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 10 వేల మందికి పైగా ఉద్యోగుల్లో కోత విధించే దిశగా సంస్థ ఆలోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు వెల్లడించింది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న SAP ఉద్యోగుల్లో దాదాపు 9 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏఐ కోసం సంస్థలో భారీ మార్పులు :
ఏఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్ఏపీ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో మార్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఏయే విభాగాల్లో అవకాశాలున్నాయో గుర్తించాలని ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లకు సూచించినట్లు నివేదిక పేర్కొంది..
అయితే, ఉద్యోగాల కోతపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కార్మిక సంఘాలతో చర్చల తర్వాత ఈ సంఖ్యలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించిన ఎస్ఏపీ కంపెనీ తమ వ్యాపార వ్యూహాలు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని తెలిపింది. ఉద్యోగాల కోతపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..
గతంలోనూ భారీగా ఉద్యోగాల కోత :
ఎస్ఏపీకి ఉద్యోగుల సంఖ్య తగ్గించడం కొత్తేమీ కాదు. 2024లోనూ సంస్థ దాదాపు 10 వేల ఉద్యోగాలపై ప్రభావం చూపే రీకన్స్ట్రక్షన్ ప్రొగ్రామ్ ప్రకటించింది. ఇందుకోసం సుమారు 3 బిలియన్ యూరోలు ఖర్చు చేసింది.
అయితే, అప్పట్లో ఎక్కువగా స్వచ్ఛంద పదవీ విరమణలు, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మార్పులు చేపట్టింది.. ప్రస్తుతం ఎస్ఏపీలో ప్రపంచవ్యాప్తంగా 1.10 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. జర్మనీలో ఉద్యోగులకు 2028 వరకు ఉపాధి భరోసా కూడా ఉంది.
ఇదిలా ఉంటే.. సంస్థలో కీలకమైన నాయకత్వ మార్పులు కూడా జరుగుతున్నాయి. సీఈఓ క్రిస్టియన్ క్లైన్ ఏఐ ఆధారిత వ్యూహంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎఫ్ఓ డొమినిక్ అసామ్ సైతం ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఆశించడం లేదని ఇటీవల వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా ఏఐ రాకతో టెక్ కంపెనీల్లో పని విధానాలే కాదు, ఉద్యోగాల స్వరూపం కూడా మారుతోంది. ఇప్పుడు ఎస్ఏపీలో కూడా ఏఐ రాకతో వేలల్లో ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారు..




