ముగిసిన ఏపీ కేబినెట్.. 30కి పైగా కీలక అంశాలకు ఆమోదం.. రైతులకు భారీ ఊరట!

Must read

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 30కి పైగా కీలక నిర్ణయాలకు ఆమోదం లభించి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగ కల్పన దిశగా పెద్ద ముందడుగు పడింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా ఇండియా రెండో కార్ల తయారీ కేంద్రం, అనుబంధ సంస్థల ద్వారా సుమారు 12 వేల ఉద్యోగాలు, శ్రీకాకుళంలో రూ.13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అచ్యుతాపురంలో సెయింట్ గోబెన్ గ్లాస్, ఏటీసీ టైర్ల విస్తరణ, చిత్తూరులో ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్, న్యూట్రిక్రీమ్స్, మూలపేట కెమికల్ పార్క్, లేపాక్షి ఏరోస్పేస్ భూ కేటాయింపు, ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లుకు కూడా మంత్రివర్గం(AP Cabinet) ఆమోదముద్ర వేసింది.

అమరావతి నిర్మాణాలకు భారీ నిధులు.. సచివాలయం, అసెంబ్లీ పనులకు వేగం:

రాజధాని అమరావతిలో గ్రీన్ వర్క్స్ కోసం రూ.180.68 కోట్లు, సచివాలయం, హెచ్‌వోడీ భవనాల అంచనా వ్యయాన్ని రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.380 కోట్ల కాంట్రాక్ట్, హైకోర్టు భవనంలో విద్యుత్, లిఫ్టులు, ఫైర్ సేఫ్టీ పనులకు రూ.432 కోట్లు, అమరావతి గ్రామాల మౌలిక వసతులకు రూ.1,215 కోట్లు మంజూరు చేశారు. అమరావతి సంగమం నిర్మాణం కోసం రూ.626 కోట్ల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపుతూ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గవర్నెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్‌కు రూ.1,500 కోట్ల బ్రిడ్జి లోన్‌కు ఆమోదించారు.

సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు.. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత:

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచే క్రమంలో కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు కోసం 1,127 ఎకరాల భూమిని 33 ఏళ్ల లీజుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. నంద్యాలలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఎకోరెన్ నుంచి జెంటారి రెన్యూవబుల్స్‌కు బదిలీ చేయడంతో పాటు ప్రకాశం జిల్లా పొలవరంలో 12 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 119 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం 31.46 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ హరిత ఇంధన రంగానికి ప్రోత్సాహం అందించింది.

భూ సమస్యల పరిష్కారం.. రైతులు, పట్టాదారులకు భారీ ఊరట:

దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంలో భాగంగా అనంతపురం జిల్లాలో 4,352 మంది పట్టాదారులకు లబ్ధి చేకూరేలా 9,917 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రైల్వే కోడూరు మండలంలో 5,324 మంది రైతులకు సంబంధించిన భూ రికార్డుల సవరణ, 10,192 ఎకరాల్లో అథుకుబడి పట్టాలను జిరాయితీ పట్టాలుగా మార్చే నిర్ణయానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయాల ద్వారా రైతులు, భూ యజమానులకు స్పష్టమైన హక్కులు లభించడంతో పాటు పారిశ్రామిక, రాజధాని, విద్యుత్, భూ సంస్కరణల ప్రతిపాదనలు వేగంగా అమల్లోకి రానున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article