Tirumala 121 Kg Gold Ornaments Donation : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిపై భక్తులకు ఉండే అచెంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తన పేరుగానీ, వ్యక్తిగత వివరాలు బయటకు చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళాలంగా సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఓ భక్తుడు ఇంత పెద్దమొత్తంలో బంగారంను స్వామివారికి కానుకగా ఇవ్వడం టీటీడీ చరిత్రలోనే మొదటిసారి. అయితే, ఇప్పుడు అందరిలోనూ ఓ అంశం ఆసక్తిని రేపుతోంది.. 121 కేజీల బంగారంతో స్వామివారికి ఎలాంటి నగలు చేయించబోతున్నారు.. ఎప్పుడు స్వామివారికి సమర్పిస్తారు.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అపురూపమైన కానుక అందనుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేసిన 45 స్వర్ణాభరణాలను ఓ భక్తుడు స్వామివారికి సమర్పించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుడు అందజేయనున్నారు. టీటీడీ చరిత్రలోనే ఒకే భక్తుడు ఇంత భారీ స్థాయిలో స్వర్ణాభరణాలను విరాళంగా అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
శ్రీవారి అలంకరణకు అనువుగా మొత్తం 45 రకాల ఆభరణాలతో ఈ ప్రత్యేక సెట్‌ను రూపొందించారు. కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు తదితర ఆభరణాలు ఇందులో ఉన్నాయి. టీటీడీ అధికారులు, అర్చకులు, బొక్కసం అధికారుల సూచనల మేరకు ఓ ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ద్వారా వీటిని సిద్ధం చేయించారు. ఇప్పటికే ఈ ఆభరణాలు తిరుపతికి చేరుకున్నాయి. గురువారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీటిని తిరుమలకు తరలించారు. వీటి ప్రదర్శన కోసం ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రత్యేక వేదికను కూడా సిద్ధం చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథిగృహానికి చేరుకుంటారు. సంప్రదాయ వస్త్రధారణలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ మీదుగా ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం సమక్షంలో దాత ఈ స్వర్ణాభరణాలను టీటీడీకి అందజేయనున్నారు. ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, టికెట్ల కేటాయింపు తదితర అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
ప్రస్తుతం దాత అందించే 121 కేజీల స్వర్ణాభరణాల సెట్ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే భారీ విరాళంగా చెబుతున్నారు. తిరుమల శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తుల అలంకరణ కోసం ఇప్పటికే దాదాపు 650 కిలోల ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.6 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వజ్రాలు, రత్నాలు, కెంపుల విలువను కలిపితే మొత్తం విలువ రూ.10 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా అందనున్న 121 కిలోల స్వర్ణాభరణాల సెట్‌తో శ్రీవారి అలంకరణకు మరో అద్భుతమైన ఆభరణాల సముదాయం చేరనుంది.
శ్రీనివాసుడికి తొలుత ఆకాశరాజు బంగారు కిరీటం చేయించాడని పురాణ కథనం. ఆ తరువాత 12వ దశాబ్దం వరకు స్వర్ణాభరణాలు, వివిధ రకాల వస్తువులు స్వామివారికి పలు దఫాలుగా అందినప్పటికీ వాటి వివరాలు నమోదు కాలేదు. 12వ శతాబ్దం నుంచే స్వర్ణాభరణాలు భారీగా అందాయని శాసనాల ద్వారా తెలుస్తోంది.




