ఆకాశంలో ఒక తార సినిమాపై ఏపీ హోం మంత్రి రివ్యూ.. ఒక ఆడపిల్ల కలలకు నమ్మకం తోడైతే..

Must read

Anitha Vangalapudi : దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా ఇటీవల రిలీజ్ అయిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా మంచి విజయం సాధించింది. అల్లు అరవింద్, స్వప్న దత్ నిర్మాణంలో పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షంలోకి వెళ్లాలన్న భార్య కలని నిజం చేయడానికి ఒక భర్త పడే కష్టం కథే ఈ ఆకాశంలో ఒక తార సినిమా. ఇప్పటికే ఈ సినిమాని ప్రేక్షకులతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు అభినందించారు. తాజాగా ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఈ సినిమా చూసి తన సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు.

వంగలపూడి అనిత తన ట్విట్టర్ లో..ఆకాశంలో ఒక తార సినిమా చూడడం జరిగింది. చక్కటి కథాంశం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, గొప్ప స్ఫూర్తినిచ్చే సందేశంతో ఈ సినిమా ఆలోచింపజేసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన చిత్రం ఇది. ఒక ఆడపిల్ల కలలకు తల్లిదండ్రుల నమ్మకం తోడైతే, సమాజం విధించే హద్దులను దాటి, ఆకాశాన్ని కాదు… అంతరిక్షాన్నే తన గమ్యంగా మార్చుకోగలదు. ఆమె కలలకు రెక్కలివ్వాలే తప్ప, హద్దులు విధించకూడదనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా అందించింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారితో పాటు నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

ఇంత మంచి కథను ఎంచుకుని, తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు పవన్ సాధినేనికి నా ప్రత్యేక అభినందనలు. విభిన్నమైన చిత్రాలతో పాటు, హృదయానికి హత్తుకునే కథలను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న స్వప్న సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌లకు, అలాగే ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. హోమ్ మంత్రి ట్వీట్ పై నిర్మాణ సంస్థ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article