Cm Revanth Reddy: తెలంగాణలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం, పౌల్ట్రీ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ (HICC)లో ఘనంగా జరుగుతున్న ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026’ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు త్వరలోనే సింగిల్ విండో విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
దాణా సమస్యపై 48 గంటల్లో నిర్ణయం:
పౌల్ట్రీ రంగం ప్రస్తుతం తీవ్రంగా ఎదుర్కొంటున్న దాణా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)తెలిపారు. ఈ విషయంపై 48 గంటల్లోగా సమగ్ర సమీక్ష నిర్వహించి, తగిన నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పౌల్ట్రీ రంగానికి అవసరమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రైతులు, పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
18 ఏళ్లుగా పౌల్ట్రీ మీట్.. ఫ్యూచర్ సిటీపై కీలక ప్రకటన:
హైదరాబాద్ వేదికగా గత 18 ఏళ్లుగా పౌల్ట్రీ మీట్ నిర్వహిస్తూ ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో గొప్ప విషయమని సీఎం ప్రశంసించారు. అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు ప్రతిపాదనలు అందిస్తే, వాటిని తప్పకుండా పరిశీలిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




