- తెలంగాణ నీటి హక్కులకు సమాధి కట్టింది కేసీఆరేనా?
- పోతిరెడ్డిపాడు నుంచి పల్నాడు వాటర్ గ్రిడ్ వరకు..
- కేసీఆర్ సంతకాలపై సీఎం రేవంత్ సూటి ప్రశ్నలు
Telangana Water Dispute : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి హక్కులకు నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యంగా కేసీఆర్, హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు..
కేసీఆర్ మౌనం ఎందుకు? :
పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును 2022లోనే అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రారంభించారని గుర్తు చేశారు.
రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జల్‌జీవన్ మిషన్ కింద ప్రాజెక్టు చేపట్టేందుకు జీవో ఇచ్చారని చెప్పారు. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ అంశంపై ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు..
Read Also :
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విషయం తమ దృష్టికి రావడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు..
హరీశ్‌రావుపై పాత నిర్ణయాలతో ఎదురుదాడి :
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలోనూ హరీశ్‌రావును రేవంత్ టార్గెట్ చేశారు. 2005 బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని, ఆ సమయంలో హరీశ్‌రావుతో పాటు అప్పటి టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. బడ్జెట్ ఆమోదం సమయంలో మంత్రులుగా ఉన్నవారు బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు రాజకీయంగా వైఎస్ఆర్ గురువని వ్యాఖ్యానించారు..
తెలంగాణకు వాటా ఎంతంటే? :
కృష్ణా నదిలో ఉన్న 811 టీఎంసీల నీటికి సంబంధించి తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉందని రేవంత్ రెడ్డి వాదించారు. అయితే, 2015 జూన్ 26న జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్ అంగీకరించారని ఆరోపించారు. 2020లోనూ ఇదే విషయంలో మరోసారి నిర్ణయం జరిగిందని విమర్శించారు..
తెలంగాణ నీటి హక్కుల విషయంలో గత పాలకుల నిర్ణయాలే ఇప్పుడు సమస్యలకు కారణమయ్యాయని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఈ విమర్శలకు ఎలా సమాధానం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. నీళ్ల విషయంలో మొదలైన ఈ రాజకీయ పోరు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..

