Avinash Reddy Arrest: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పలు చోట్ల రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సాక్షాత్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసులు కావాలనే నామినేషన్ల స్వీకరణలో జాప్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా అభ్యర్థులు పలుమార్లు నామినేషన్ కేంద్రానికి వెళ్లినప్పటికీ, లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని అంకాలమ్మగూడూరు సర్పంచ్ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్పీ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన:
పోలీసుల ఏకపక్ష తీరును నిరసిస్తూ అంకాలమ్మగూడూరు సర్పంచ్ అభ్యర్థులు పులివెందుల డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం డీఎస్పీ మురళి నాయక్‌ను నేరుగా కలిసి తమకు ఎదురవుతున్న అడ్డంకులు, సమస్యలను వివరంగా తెలియజేశారు.
రంగంలోకి దిగిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి:
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(Avinash Reddy Arrest) స్వయంగా అభ్యర్థుల వెంట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించి, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసుకునేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డీఎస్పీని కోరారు. ఈ పరిణామాల మధ్య కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

