Homeఆంధ్రప్రదేశ్ఉత్తరాంధ్ర తీరం వైపు తీవ్ర ‘అక్వాన్’ తుపాను.. రానున్న 36 గంటలు అత్యంత కీలకం.. 70...

ఉత్తరాంధ్ర తీరం వైపు తీవ్ర ‘అక్వాన్’ తుపాను.. రానున్న 36 గంటలు అత్యంత కీలకం.. 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఈ జిల్లాలకు హై అలర్ట్!

Cyclone Aquan: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అక్వాన్’ తుపాను ఉత్తరాంధ్ర తీరం వైపు వేగంగా దూసుకొస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గడచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తున్న ఈ తుపాను, గురువారం ఉదయం 5:30 గంటల సమయానికి విశాఖపట్నానికి 460 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను శుక్రవారం (నవంబర్ 20) తెల్లవారుజామున శ్రీకాకుళానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయానికి ఇది కాస్త బలహీనపడి తీవ్ర వాయుగుండం లేదా తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని, ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు.. ఆ ప్రాంతాలకు అలర్ట్:

తుపాను(Cyclone Aquan) ప్రభావంతో రానున్న 24 నుంచి 36 గంటల సమయం ఉత్తరాంధ్ర జిల్లాలకు అత్యంత కీలకమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు (గురువారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా ఉత్తరాంధ్రలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగి, తుపాను పూర్తిగా తీరం దాటిన అనంతరం వర్షాల తీవ్రత వేగంగా తగ్గుముఖం పట్టనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించగా, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాలపై ఈ తుపాను ప్రభావం గణనీయంగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.

వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు కఠిన హెచ్చరిక.. తీర ప్రాంతాల్లో అప్రమత్తత:

తుపాను నేపథ్యంలో సముద్రం అత్యంత అలజడిగా, కల్లోలంగా మారినందున మత్స్యకారులు తదుపరి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments