రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్.. ‘పీఎం-రాహత్’ కింద రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. NMC కీలక ఆదేశాలు!

Must read

PM RAHAT Scheme: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలను గణనీయంగా తగ్గించేందుకు, ప్రమాద బాధితులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్’ (పీఎం-రాహత్) పథకంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులు తప్పనిసరిగా ఈ పథకంలో చేరాలని ఎన్ఎంసీ స్పష్టం చేస్తూ తాజాగా పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఎ) రూపొందించిన ప్రత్యేక మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ స్కీమ్ కింద మోటారు వాహన ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన రోజు నుంచి గరిష్ఠంగా 7 రోజుల పాటు రూ. 1.50 లక్షల వరకు పూర్తిస్థాయి క్యాష్‌లెస్ (నగదు రహిత) వైద్య సేవలు అందనున్నాయి.

‘గోల్డెన్ అవర్’పై ప్రత్యేక ఫోకస్.. హైవేలు, బ్లాక్ స్పాట్‌ల సమీప ఆసుపత్రులకు ప్రాధాన్యం:

రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంట అంటే ‘గోల్డెన్ అవర్’లోనే బాధితులకు సకాలంలో నాణ్యమైన చికిత్స అందించి వారి విలువైన ప్రాణాలను కాపాడటమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం జాతీయ రహదారులు, తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లకు సమీపంలో ఉన్న ఆసుపత్రులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ సమయంలో చిన్న దవాఖానల్లోనూ బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు.

ఇతర హెల్త్ స్కీముల కంటే దీనికే ప్రయారిటీ.. అక్రమాలకు పాల్పడితే ఆసుపత్రులు బ్లాక్‌లిస్ట్:

ప్రమాద బాధితులకు వైద్యం అందించే విషయంలో ఇతర ఆరోగ్య బీమా పథకాల కంటే ‘పీఎం-రాహత్’ స్కీమ్‌కే మొదటి ప్రాధాన్యత (ప్రయారిటీ) ఇవ్వాలని అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే, ఈ అత్యవసర పథకం అమలులో ఏవైనా ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడినా, బిల్లుల విషయంలో అవకతవకలకు పాల్పడినా లేదా బాధితులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించినా సదరు ఆసుపత్రులను తక్షణమే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని ఎన్ఎంసీ గట్టిగా హెచ్చరించింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!