Hyderabad Power Cut Alert: హైదరాబాద్ నగరవాసులకు విద్యుత్ శాఖ అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేసింది. నగరంలోని పలు డివిజన్ల పరిధిలో అత్యవసర విద్యుత్ మరమ్మతులు, 11 కేవీ లైన్ మార్పిడి, రోడ్డు వెడల్పు పనుల కారణంగా బుధవారం (నవంబర్ 18) వివిధ సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా నగరవాసులు తమ అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని కేఎంఐటీ 11 కేవీ ఫీడర్ కింద ఉన్న దీపక్ థియేటర్ లేన్, హరివిహార్ కాలనీ, కేశవ్ మెమోరియల్ స్కూల్, జీహెచ్ఎంసీ నారాయణగూడ మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. అలాగే ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని తిరుమల హిల్స్, రెవెన్యూ బోర్డు కాలనీ, గడ్డిఅన్నారం, నారాయణ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కరెంట్ ఉండదని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
రామంతాపూర్, చెంగిచర్ల ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు!
మరోవైపు రామంతాపూర్ విద్యుత్ (Hyderabad Power Cut Alert)సబ్‌స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్ ఫీడర్ కింద ఉన్న శారదా నగర్, ఆనంద్ నగర్, పాత రామంతాపూర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, కామాక్షీపురం ఫీడర్ పరిధిలోని కామాక్షీపురం, వాసవీ నగర్, రాంరెడ్డి నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ కోత ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ మేఘనాదం వెల్లడించారు. ఇక చెంగిచర్ల పరిధిలో రోడ్డు వెడల్పు పనుల దృష్ట్యా 33/11 కేవీ లైన్ పనులు చేపడుతున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 11 కేవీ వెంకటసాయినగర్ ఫీడర్ పరిధిలోని శివగణేష్ నగర్, ఎంఎల్ఆర్ కాలనీ, అక్షయ నగర్, రాజేష్ నగర్, మహాగణపతి నగర్, ప్రతాప్ ఎన్క్లేవ్, దత్తాత్రేయ నగర్, నందిని నగర్, సాయి రెసిడెన్సీ, వెంకటాద్రి నగర్, ప్రివిలేజ్ కాలనీ, వెంకటసాయినగర్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని మేడిపల్లి ఏఈ హరినాథ్ తెలిపారు.
బోడుప్పల్ పరిధిలో 5 గంటల పాటు కరెంట్ బంద్.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి:
అదేవిధంగా బోడుప్పల్ రోడ్డులో హెచ్ఎండీఏ (HMDA) అభివృద్ధి పనుల కారణంగా 11 కేవీ లైన్ మార్పిడి, 10 స్పాన్ల కొత్త లైన్ స్ట్రింగింగ్, పాత స్తంభాల తొలగింపు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని బోడుప్పల్ ఏఈ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ ఐదు గంటల సమయంలో 11 కేవీ ఇందిరానగర్ ఫీడర్ పరిధిలోని సాయిరాం కాలనీ, శ్రీనివాస కాలనీ, బృందావన్ కాలనీ, ఆనంద్ నగర్, ఎస్సీ బస్తీ, బొమ్మక బ్రదర్స్ కాలనీ, తూర్పు హనుమాన్ నగర్, పశ్చిమ హనుమాన్ నగర్, సన్నీ బేకరీ మెయిన్ రోడ్డు, సాయి భవానీ నగర్ కాలనీల ప్రజలు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


