Sankranti Trains Full: తెలుగు వారి అతిపెద్ద పండగ సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యే ప్రయాణికులకు ఇప్పట్నుంచే రైలు ప్రయాణం భారంగా మారింది. పండగకు మరో రెండు నెలల సమయం ఉండగానే, 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ విండో తెరుచుకున్న నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ స్టేషన్ల నుంచి ఖమ్మంతో పాటు ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి మార్గాల్లో వెళ్లే ప్రధాన రైళ్లన్నీ ‘రిగ్రెట్’ (Regret) స్థితికి చేరుకున్నాయి. కనీసం వెయిటింగ్ లిస్టులో కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేకపోవడంతో పండక్కి ఊరెళ్లాలనుకునే కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి.
స్లీపర్‌తో పాటు ఏసీ, వందేభారత్ రైళ్లలోనూ భారీ రద్దీ:
సాధారణంగా స్లీపర్ క్లాస్ టికెట్లకు మాత్రమే ఉండే డిమాండ్ ఈసారి ఏసీ బోగీలు(Sankranti Trains Full), ప్రీమియం రైళ్లకు కూడా పాకింది. గౌతమి, నారాయణాద్రి, గోదావరి, విశాఖ, నర్సాపూర్, శబరి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉండే విశాఖపట్నం దురంతో, గరీబ్‌రథ్, వందేభారత్ రైళ్లలోనూ టికెట్లు దొరకడం లేదు. కొన్ని వందేభారత్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 130 నుంచి 270 వరకు చేరింది. కేవలం నల్గొండ, గుంటూరు మీదుగా వెళ్లే హైదరాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 9-13 తేదీల్లో, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో 9, 10, 11 తేదీల్లో మాత్రమే పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయాణికులకు ఊరట:
రైలు టికెట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు అనివార్యంగా ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల వైపు చూస్తున్నారు. అయితే పండగ వేళ ప్రైవేటు బస్సుల ఛార్జీలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉన్నందున సామాన్యులపై ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తక్షణమే సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, జనసాధారణ్ రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


