Shreyas Iyer : మౌంట్ మౌంగనుయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 26.4 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మారిపోయిందని అదే సమయంలో కివీస్ బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
విల్ యంగ్ సెంచరీ (125; 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. టిమ్ సీఫెర్ట్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిన్ అలెన్ (41; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అకిల్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 26.4 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (27; 53 బంతుల్లో 4 ఫోర్లు), అక్షర్ పటేల్ (21; 36 బంతుల్లో 3 ఫోర్లు), నమన్ ధీర్ (21; 24 బంతుల్లో 2 సిక్సర్లు) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఆరు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీయగా.. కైల్ జేమిసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
నిర్లక్ష్యంగా ఆడలేదు..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మొదటి ఇన్నింగ్స్‌కు, రెండో ఇన్నింగ్స్‌కు పిచ్‌లో చాలా తేడా కనిపించిందన్నాడు. అయితే.. కివీస్ బౌలర్ హెన్రీ మాత్రం మొదటి బంతి నుండే సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసిన తీరు అద్భుతం, అతనికి తగిన ప్రశంసలు దక్కాలన్నాడు.
‘మొదటి ఇన్నింగ్స్‌లో మేము దాదాపు అన్ని రకాల వ్యూహాలను ప్రయత్నించాం, కానీ ప్రత్యర్థి బ్యాటర్లు బంతిని చాలా బాగా ఎదుర్కొన్నారు. వారు 330 పరుగులు చేశారంటే, ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉందని మేము భావించాం. అదే సమయంలో మేము కొన్ని క్యాచ్‌లు జారవిడిచాం, కానీ ఆటలో ఇలాంటివి సహజమే. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు.. మేము ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలమని అనుకున్నాం. కానీ బంతి పిచ్‌పై పడిన తర్వాత అటు ఇటు స్వింగ్ అవుతూ, సీమ్ అవుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో ముందుగానే నిర్ణయించుకోవడం చాలా కష్టం. వికెట్లు పడిన తీరును చూస్తే, ఎవరూ నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ను పారేసుకోలేదు. ప్రత్యర్ధి బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు.
సాధ్యమైనంత త్వరగా ఈ ఓటమిని మర్చిపోయి.. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకోవడం ముఖ్యం. అదే సమయంలో.. మనం ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విజయాల నుంచి స్ఫూర్తి పొంది.. తదుపరి మ్యాచ్‌కు కొత్త ఉత్సాహంతో ప్రశాంతమైన మనసుతో సిద్ధమవ్వాలి.’ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.


