APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC Group 2) మొత్తం 720 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి గ్రూప్-2 పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనున్న మొత్తం ఖాళీల్లో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.
ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు.. డిసెంబర్ 11 దరఖాస్తుకు ఆఖరు తేది:
గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కాగా, అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఎగ్జిక్యూటివ్ విభాగంలో అత్యధికంగా 203 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీఓ, 40 జిఎస్టి ఆఫీసర్ మరియు 29 ఎక్సైజ్ ఎస్సై పోస్టులు ఉండగా, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 80 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), 91 సీనియర్ అకౌంటెంట్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఫిబ్రవరి 21న స్క్రీనింగ్ టెస్ట్.. డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఓఎంఆర్ (OMR) ఆధారితంగా గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అనంతరం నిర్వహించే ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. వయో పరిమితి, జోన్ల వారీగా ఖాళీల వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని సూచించింది.


