Singareni PLR Bonus: దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కాలరీస్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన పనితీరును పరిగణనలోకి తీసుకుని, కోల్ ఇండియా సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (Singareni PLR Bonus) బోనస్‌ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ (గురువారం) అర్హులైన ప్రతి సింగరేణి కార్మికుడికి రూ.1,10,250 చొప్పున బోనస్ చెల్లింపులు జరగనున్నాయి. ఇప్పటికే దసరా పండుగ కానుకగా సంస్థ లాభాల వాటా కింద సగటున ఒక్కొక్కరికి రూ.1,53,912 చెల్లించగా, తాజాగా అందుతున్న ఈ భారీ పీఎల్‌ఆర్ బోనస్‌తో గనుల ప్రాంతాల్లో పండుగ ఉత్సాహం రెట్టింపయింది.
దేశ ఇంధన భద్రతకు వెన్నెముక.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు:
ఈ పండుగ కానుక సందర్భంగా సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అహోరాత్రులు శ్రమిస్తూ దేశ ఇంధన భద్రతకు సింగరేణి కార్మికులు వెన్నెముకగా నిలుస్తున్నారని, వారి శ్రమ వెలకట్టలేనిదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. బొగ్గు రంగ అభివృద్ధికి, కార్మికుల భద్రత, సంక్షేమం, ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేస్తూ, సింగరేణి పురోగతికి కేంద్రం నుంచి తగిన సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.


