- ఓటర్లతో నేరుగా మాట్లాడిన ఎన్నికల కమిషనర్
- ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి..
- సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ పూర్తి
AP MPTC, ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.. ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు..
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్, విజయవాడ రూరల్ మండలం పాతపాడు, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు..
Read Also :
అన్ని ఏర్పాట్లపై ఆరా.. :
కేవలం అధికారులతో మాట్లాడటమే కాకుండా.. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లతోనూ నేరుగా మాట్లాడారు. ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అంటూ ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు, సిబ్బంది చెప్పినట్లు కమిషనర్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సమర్థంగా చేసిందని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
5 గంటల్లోపు పోలింగ్ పూర్తి :
సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని వివరించారు. రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక వాటిని భద్రపరుస్తామని తెలిపారు.
తాను పరిశీలించిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఉందని, స్ట్రాంగ్ రూమ్‌లలోనూ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ వి. అభిషేక్‌తోనూ పోలింగ్ సరళిపై చర్చించారు. ఇంకా పోలింగ్ సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనిల్ చంద్ర పునేఠ పిలుపునిచ్చారు..


