Strait Of Hormuz: ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకలపై ఆంక్షల పర్వం కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మిత్ర దేశాలైన భారత్, చైనా, ఇరాక్, ఖతార్లకు చెందిన వాణిజ్య నౌకలకు ఈ జలసంధిలో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ స్పష్టం చేశారు. మిగిలిన దేశాలపై విధించిన కఠిన ఆంక్షలతో ప్రమేయం లేకుండా ఈ నాలుగు దేశాల నౌకలు ఇకపై హర్మూజ్ గుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు.
ఔషధాల సరఫరా, దౌత్య ప్రయోజనాలే లక్ష్యం.. స్పష్టం చేసిన ఇరాన్:
ఈ ప్రత్యేక మినహాయింపు వెనుక తమ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఇరాన్ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు అత్యవసర ఔషధాల (Medicines) సరఫరాను సులభతరం చేయడమే ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. అలాగే చైనా నుంచి రాజకీయ మద్దతు పొందడం, ప్రాంతీయ వ్యాపారాన్ని బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలని పేర్కొన్నారు. అయితే ఈ మినహాయింపు ఉన్నప్పటికీ, ఆయా దేశాల నౌకల నుంచి నిబంధనల ప్రకారం రవాణా రుసుమును మాత్రం వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
అమెరికా ఆంక్షల నడుమ హర్మూజ్‌లో ఊరట.. పశ్చిమాసియా వాణిజ్యానికి మేలు:
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఈ నాలుగు దేశాల నౌకలను అమెరికన్ బలగాలు కూడా అడ్డుకోబోవని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది. అమెరికా ఆంక్షల ప్రతిష్టంభన నడుమ అంతర్జాతీయ ఇంధన, వాణిజ్య మార్గమైన హర్మూజ్‌లో భారత్‌కు ఈ వెసులుబాటు లభించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయంతో భారత దిగుమతులు, ఎగుమతులకు ఎదురవుతున్న రవాణా అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, పశ్చిమాసియా ప్రాంతంలో ఔషధాల పంపిణీ వేగవంతం కానుంది.


