- వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు..
- ఒక్క HI మెసేజ్‌తో పీఎఫ్ వివరాలన్నీ మీ చేతిలోకి
- OTP రావడం లేదంటూ యూజర్ల ఫిర్యాదులు
EPFO WhatsApp Service : ఇక మీ PF బ్యాలెన్స్ ఎంత ఉంది? ఖాతాలో చివరిగా ఎప్పుడు డబ్బులు జమయ్యాయి? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని వాట్సాప్‌లో ఒక్క HI మెసేజ్ పంపితే చాలు.. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) వివరాలు తెలుసుకోవచ్చు.
ఇందుకోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సరికొత్త వాట్సాప్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వాట్సాప్ సర్వీసు ప్రస్తుతం ప్రతి పీఎఫ్ ఖాతాదారుడికి అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ పీఎఫ్ వాట్సాప్ సర్వీసును ఎలా వినియోగించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
వాట్సాప్‌లో ఏయే వివరాలు తెలుసుకోవచ్చు? :
ఈపీఎఫ్ఓ అందించే ఈ కొత్త సర్వీసు ద్వారా సభ్యులు 3 ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు.
- మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఎంత?
- పీఎఫ్ పాస్‌బుక్ వివరాలు ఏంటి?
- ఖాతాలో చివరిగా జరిగిన 5 లావాదేవీలు (Last 5 Transactions) ఏవి?
- ఇలా అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను తెలుసుకోవచ్చు.
వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
ముందుగా మీ మొబైల్‌లో 8796441800 అనే EPFO నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు HI అని మెసేజ్ పంపాలి. అనంతరం అడిగిన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే..
Read Also :
మీరు వాట్సాప్‌లో వాడే మొబైల్ నంబర్ మీ UAN (Universal Account Number)కు లింక్ అయి ఉండాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు కావాల్సిన సేవను ఎంచుకుని పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్, లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు..
OTP రావడం లేదా? యూజర్లకు కొత్త సమస్యలు :
అయితే, ఈ కొత్త సర్వీసుపై కొందరు యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా సేవలు పొందేందుకు ప్రయత్నిస్తుంటే ఓటీపీ రావడం లేదని కొందరు, పీఎఫ్ బ్యాలెన్స్ లేదా పాస్‌బుక్ ఓపెన్ చేయగానే ఎర్రర్ మెసేజ్ వస్తోందని మరికొందరు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్య అందరికీ వస్తోందా? లేక కొందరికే పరిమితమైందా? అనేది ఇంకా క్లారిటీ లేదు..
కొత్తగా ప్రారంభమైన సర్వీసు కావడంతో ప్రారంభ దశలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఉద్యోగులకు పీఎఫ్ వివరాలు తెలుసుకోవడం మరింత ఈజీ కానుంది..



