Diwali 2026: 2026 సంవత్సరంలో దీపావళి పర్వదినం పట్ల భక్తులలో ఉన్న సందేహాలకు పంచాంగ వేత్తలు స్పష్టతనిచ్చారు. నవంబర్ 8 (ఆదివారం) వేకువజామున అరుణోదయ వేళలో చతుర్దశి తిథి ఉండటంతో పాటు, అదే రోజు ఉదయం 10:30 గంటల తర్వాత అమావాస్య ప్రారంభమై రాత్రి ప్రదోష కాలంలో వ్యాపించి ఉంటుంది. ఈ కారణంతో నరక చతుర్దశి తెల్లవారుజాము అభ్యంగన స్నానాలు, సాయంత్రం వేళ దీపావళి ధనలక్ష్మీ పూజలను ఆదివారం (నవంబర్ 8) రోజే నిర్వహించుకోవడం అత్యంత శాస్త్రోక్తం, శుభప్రదం అని చెప్తున్నారు.
లక్ష్మీ పూజా శుభ ముహూర్తాలు.. ప్రదోష కాలం, వృషభ లగ్నం:
దీపావళి (Diwali 2026)నాటి సాయంత్రం ప్రదోష కాలంలో ధనలక్ష్మి, కుబేర పూజలు ఆచరించడానికి పండితులు ప్రత్యేక ముహూర్తాలను నిర్దేశించారు. సాయంత్రం 5:24 గంటల నుంచి 7:36 గంటల వరకు ప్రదోష కాల ముహూర్తం ఉండగా, రాత్రి 6:57 గంటల నుంచి 9:47 గంటల మధ్య వృషభ లగ్నం అత్యంత శ్రేష్ఠమైనదిగా పేర్కొన్నారు. స్థిర లగ్నమైన వృషభ లగ్నంలో చేసే పూజ వల్ల ఇళ్లలో మహాలక్ష్మి స్థిరంగా నివాసముంటుందని నమ్ముతారు. అంతేకాకుండా రాత్రి 11:28 నుంచి 12:15 గంటల మధ్య నిశీథ కాలంలో చేసే అర్ధరాత్రి లక్ష్మీ పూజ కూడా విశేష ఫలాలను ఇస్తుందని పంచాంగ నిపుణులు వెల్లడించారు.
ఆకాశదీపం, కార్తీక మాసారంభం వివరాలు:
ఇక పండుగ మరుసటి రోజున అనగా నవంబర్ 9 (సోమవారం) ఉదయం సూర్యోదయ సమయానికి అమావాస్య తిథి కొనసాగుతుండటంతో ఆ రోజు సాయంత్రం వేళల్లో ఆకాశదీపం వెలిగించడం ఆనవాయితీ. అనంతరం నవంబర్ 10 (మంగళవారం) నుండి పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ పవిత్ర దినాల్లో ఉదయాన్నే దీపారాధనలు చేసి, ప్రదోష వేళలో లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేదపండితులు తెలియజేశారు.



