- చివరి EMI కట్టేశారా? బ్యాంకు నుంచి ఈ డాక్యుమెంట్లు తీసుకున్నారా?
- 30 రోజుల్లో పత్రాలు ఇవ్వకపోతే రోజుకు రూ.5 వేల పరిహారం
- ఇంటి రుణం తీరిపోయిందని రిలాక్స్ అవ్వకండి..
- బ్యాంకు నుంచి ఈ పత్రాలు తప్పనిసరిగా తీసుకోండి
Home Loan Closed : సొంతింటి కల అందరికి ఉంటుంది. ఇంటి కోసం చాలామంది బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకుంటారు. నెలనెలా ఈఎంఐలు కట్టి చివరకు రుణాన్ని ఏదోలా పూర్తిగా చెల్లిస్తారు. అయితే, చివరి ఈఎంఐ కట్టేశామని రిలాక్స్ అవ్వకండి. బ్యాంకు నుంచి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకోవడం అసలు మర్చిపోవద్దు..
ఆస్తిపై నమోదైన తనఖా ఛార్జీని తొలగించుకోవడం కూడా చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో ఇల్లు అమ్మేటప్పుడు, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లీగల్ పరంగా అనేక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
30 రోజుల్లో డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే :
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. హోమ్ లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకులు, ఇతర నియంత్రిత రుణ సంస్థలు 30 రోజుల్లోగా అసలు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలి. అలాగే ఆస్తిపై నమోదైన ఛార్జీలను తొలగించాలి. బ్యాంకు వల్లే ఆలస్యం జరిగితే, ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5వేలు చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
Read Also :
పత్రాలు పోతే బ్యాంకుదే బాధ్యత :
బ్యాంకు నిర్లక్ష్యం వల్ల అసలు డాక్యుమెంట్లు పోయినా, పాడైపోయినా వాటి డూప్లికేట్ లేదా ధృవీకరించిన కాపీలు అందించేందుకు బ్యాంకే చర్యలు తీసుకోవాలి. ఇందుకు అయ్యే ఖర్చులను కూడా భరించాలి. ఈ ప్రక్రియకు అదనంగా 30 రోజుల గడువు ఉంటుంది. అంటే డాక్యుమెంట్లు పోయిన సందర్భంలో మొత్తం 60 రోజుల వరకు గడువు వర్తించవచ్చు.
చివరి ఈఎంఐ తర్వాత ఇవి తప్పనిసరి :
- లోన్ పూర్తిగా క్లోజ్ అయినట్లు రాతపూర్వక లేఖ తీసుకోండి.
- బ్యాంకులో ఇచ్చిన అసలు ఆస్తి పత్రాల జాబితాను పొందండి.
- తిరిగి ఇచ్చే ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్తగా పరిశీలించండి.
- ఆస్తిపై ఉన్న బ్యాంకు ఛార్జీ తొలగించారా లేదా చెక్ చేయండి.
ఆలస్యం చేస్తే ఏం చేయాలి? :
30 రోజుల్లో లోన్ డాక్యుమెంట్లు అందకపోతే బ్యాంకుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఈఎంఐ రసీదులు, లోన్ క్లోజర్ లెటర్, ఈమెయిల్స్ వంటి ఆధారాలను జాగ్రత్తగా పెట్టుకోండి.. బ్యాంకు కారణంగా ఆలస్యమైతే రోజుకు రూ.5వేలు పరిహారం కోరవచ్చు. చివరి ఈఎంఐ చెల్లించడంతోనే పని పూర్తికాదు. మీ ఇంటి అసలు డాక్యుమెంట్లు మీ చేతికి వచ్చి, తనఖా ఛార్జీ తొలగినప్పుడే లోన్ క్లోజర్ ప్రాసెస్ పూర్తయినట్టు..



