- మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఉద్యోగులకు బైఅవుట్ ఛాన్స్
- ఏఐ కోసం ఖర్చులు.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫర్
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం.. 60 వేల మంది ఉద్యోగులపై ఎఫెక్ట్
Microsoft Buyout Offer : ఏఐ (AI) రాకతో టెక్ ప్రపంచంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతుంటే, ఉద్యోగుల భవిష్యత్తుపై మాత్రం ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన బైఅవుట్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది..
ఇంతమందికి ఒకేసారి ఆఫర్ ఎందుకు? :
మైక్రోసాఫ్ట్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేసుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా, భారత్, కెనడా, బ్రిటన్‌లోని ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
వైస్ ప్రెసిడెంట్ స్థాయి, అంతకన్నా కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇందులో భాగమయ్యే అవకాశం ఉంది. ఎక్స్‌బాక్స్, విండోస్, కోపైలట్, ఫైనాన్స్ వంటి విభాగాల్లోని కొంతమంది ఉద్యోగులకు ఈ అవకాశం ఉండనుంది. అయితే, అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పలేం..
ఉద్యోగులకు బెనిఫిట్ ఏంటి? :
ఈ బైఅవుట్‌ను అంగీకరించిన ఉద్యోగులకు సాధారణంగా ఉద్యోగం మానేసిన సమయంలో ఇచ్చే ప్యాకేజీ తరహాలో ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయి. కంపెనీ బయట కొత్త అవకాశాలను వెతుక్కోవాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో ఉద్యోగులను తొలగించినప్పుడు వారికి సెవెరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఉద్యోగులు పేరోల్‌లో ఉన్నంత కాలం కనీసం 60 రోజుల కనీస వేతనాన్ని పొందుతారు.
ఉద్యోగుల సీనియారిటీ, సర్వీసు పీరియడ్ బట్టి గరిష్ఠంగా 39 వారాల వరకు కనీస వేతనం పొందుతారు. ఇంటర్నల్ లెవల్ 64 లేదా ఆపై తక్కువ ఉన్న ఉద్యోగులకు ప్రతి 6 నెలల సర్వీసుకు ఒక వారం కనీస వేతనం చెల్లిస్తారు. 65 నుంచి 67 లెవల్ ఉన్న ఉద్యోగులకు ప్రతి 6 నెలల సర్వీసుకు 2 వారాల కనీస వేతనం అందుతుంది. ఉద్యోగుల స్థాయి, సర్వీసు కాలం ఆధారంగా పరిహారం చెల్లిస్తారు.
ఇండియాలో ఉద్యోగులపై ప్రభావం ఉందా? :
మైక్రోసాఫ్ట్ ఈ బైఅవుట్ ఆఫర్ యూఎస్, కెనడా, ఇండియా, యూకేలోని ఎంపిక చేసిన టీమ్ ఉద్యోగులకు, లెవెల్ 70లోని కొంతమంది ఉద్యోగులతో సహా విస్తరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ప్రకారం.. అర్హులైన వారి జాబితాలో సుమారు 60వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గత జూన్ నెలాఖరు నాటికి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 2,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Read Also :
కంపెనీ ఏఐ, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో 2022 నుంచి ఈ సంఖ్య చాలా వరకు స్థిరంగా ఉంది. ఇప్పుడు ఖర్చులు తగ్గించుకునేందుకు మైక్రోసాఫ్ట్ భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించనుంది..
ఏఐపై భారీ పెట్టుబడులు.. ఉద్యోగులపై ప్రభావం :
మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ, డేటా సెంటర్లపై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల కారణంగా ఇతర విభాగాల్లో ఖర్చులు, నియామకాలపై ఒత్తిడి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా కంపెనీ పలు దశల్లో ఉద్యోగాల కోతలు కూడా చేపట్టింది. గూగుల్, మెటా వంటి సంస్థలు సైతం ఖర్చులను తగ్గించుకునే దిశగా ఏఐపై ఫోకస్ పెడుతున్నాయి.
దీంతో టెక్ రంగంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా మారుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి, ఏఐ పోటీలో ముందుండేందుకు కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ మార్పులు వ్యాపారానికి ఎంతవరకు లాభం తెస్తాయో పక్కన పెడితే, ఉద్యోగులు మాత్రం తమ కెరీర్ గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి.
అయితే, ఉద్యోగాన్ని వదులుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. చేతిలో ఉన్న సేవింగ్స్, కుటుంబ బాధ్యతలు, మరో ఉద్యోగం దొరికే అవకాశాలు, ఇలా ఎన్నో అంశాలను ఉద్యోగులు ఆలోచించాల్సి ఉంటుంది.


