FASTag Rules: జాతీయ రహదారుల టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే నివాసితులకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నవంబర్ 1 నుంచి రాయితీతో కూడిన వార్షిక లోకల్ ఫాస్టాగ్ పాస్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు జాతీయ రహదారుల రుసుము నియమావళి, 2026 ద్వారా నోటిఫై చేసింది. మున్సిపల్ లేదా స్థానిక పట్టణ సరిహద్దుల వెలుపల ఉన్న టోల్ ప్లాజాలకు వార్షిక రుసుము రూ.1,500 కాగా, సాధారణ వ్యక్తిగత వాహనదారులకు ఇది రూ.3 వేలుగా లభించనుంది. ఈ కొత్త నిబంధన ద్వారా నిత్యం ప్రయాణించే స్థానిక వాహనదారులకు ఆర్థిక భారం తగ్గి, రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ తప్పనిసరి.. వాణిజ్యేతర వాహనాలకే ఈ పాస్ వర్తింపు:
అర్హులైన వాణిజ్యేతర (సొంత) వాహన యజమానులు తమ వద్ద ఉన్న యాక్టివ్ ఫాస్టాగ్ (FASTag Rules) ఆధారంగా నిర్దిష్ట టోల్ ప్లాజా వద్ద ఈ సదుపాయాన్ని పొందవచ్చు. వాహనదారులు ప్రస్తుతం ఉన్న నెలవారీ పాస్ లేదా ఈ రాయితీ వార్షిక పాస్‌లో ఏదో ఒకదానిని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పాస్ ఏ టోల్ ప్లాజా వద్ద తీసుకుంటారో అక్కడ మాత్రమే చెల్లుబాటు అవుతుందని, మరే ఇతర టోల్ ప్లాజాలకు ఇది వర్తించదని అధికారులు నిబంధనల్లో స్పష్టం చేశారు.
కొన్ని ప్రాంతాలకు సదుపాయం వర్తించదు.. జాతీయ రహదారుల చట్టంలో కీలక మార్పులు:
‘క్లోజ్డ్ యూజర్ ఫీజు వసూలు విధానం’ ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలపై లేదా ప్రయాణికులకు సర్వీస్ రోడ్డు, ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్న చోట్ల ఈ లోకల్ రాయితీ పాస్‌లు జారీ చేయరని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు జారీ కాగా, ‘జాతీయ రహదారుల చట్టం, 1956’లోని అధికారాల ప్రకారం చేపట్టిన ఈ సవరణ స్థానికుల నిత్య ప్రయాణాన్ని అత్యంత సరసమైనదిగా మార్చడమే లక్ష్యంగా తెచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది.


