ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో అప్పుడే నాక‌ర్థ‌మైంది.. నిజంగా అభిషేక్, వైభ‌వ్ ఉన్నారు చూడండి.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్‌..

Must read

Shreyas Iyer : న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భార‌త్ మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ గెలుపు పై భార‌త టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఇదే ఆట తీరును మిగిలిన మ్యాచ్‌ల్లోనూ వారు కొన‌సాగించాల‌ని ఆకాంక్షించాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (89 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం చేశాడు. ఫిన్ అలెన్ (40; 25 బంతుల్లో 5 సిక్స‌ర్లు) రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, అక్ష‌ర్ ప‌టేల్‌, నితీశ్ కుమార్ రెడ్డి త‌లా ఓ వికెట్ తీశారు.

ఆ త‌రువాత అభిషేక్ శ‌ర్మ (113; 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స‌ర్ల‌) విధ్వంస‌క‌ర శ‌త‌కంతో 199 ప‌రుగుల లక్ష్యాన్ని భార‌త్ 13.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభ‌వ్ సూర్య‌వంశీ (45; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కైల్ జేమీస‌న్ రెండు వికెట్లు తీశాడు. మాథ్యూ ఫిషర్, మిచెల్ సాంట్న‌ర్‌ చెరో వికెట్ సాధించారు.

ఆ ఇద్ద‌రి ఆట అద్భుతం.. చూసేందుకు..

మూడో టీ20 మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల భార‌త టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. మ్యాచ్ అనంత‌రం అత‌డు మాట్లాడుతూ.. అభిషేక్ శ‌ర్మ‌, వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట అద్భుతం అని అన్నాడు. వారిద్ద‌రు షాట్లు ఆడిన తీరు క‌ళ్ల‌కు ఎంతో ఇంపుగా అనిపించింద‌న్నాడు. సంజూ శాంస‌న్, తాను బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో బంతి బాగా స్వింగ్ అవుతోంద‌న్నాడు. అలాంటి ప‌రిస్థితుల్లో అభిషేక్, వైభ‌వ్ అలా ఎలా ఆడ‌గ‌లిగారోన‌ని ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో కేవలం 5 ఓవర్లలో 100 పరుగులు చేయడం తానేప్పుడూ చూడలేదన్నాడు. ఇది ఖచ్చితంగా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి అని చెప్పాడు.

విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో కూడా ఆట‌గాళ్లు త‌మ స‌హ‌జ‌మైన ఆట‌తీరును ఆడేలా ప్రోత్స‌హించ‌డం పై మాట్లాడుతూ.. విదేశీ పర్యటనల్లో ఇది చాలా కీలకన్నాడు. అక్క‌డి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, రకరకాల బంతులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. అటువంటి సవాళ్లను అధిగమిస్తూ ఇంత అద్భుతమైన ప్రదర్శన చేయడం అభినందనీయన్నాడు. అభిషేక్, వైభ‌వ్ ఈరోజు ఆడిన తీరు అసాధారణం. మూడో మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవడం బాగుంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్‌ల్లోనూ వారు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు.

భార‌త బౌల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న పై మాట్లాడుతూ.. 10 ఓవర్ల తర్వాత త‌న‌కు ఓ విష‌యం అర్థ‌మైంద‌న్నాడు. బౌలర్లు హార్డ్ లెంగ్త్ లేదా హాఫ్ వాలీలు వేస్తే బ్యాటర్లు వాటిని సులభంగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నారని గ‌మ‌నించిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అందుకే.. వీలైనన్ని ఎక్కువ యార్కర్లు వేయమని బౌల‌ర్ల‌కు సూచించిన‌ట్లుగా చెప్పాడు. ఒక‌వేళ అవ‌స‌రం అనుకుంటే ఆరు బంతులు కూడా యార్క‌ర్లే వేయాల‌ని చెప్పాన‌న్నాడు. బ్యాటర్లు నేరుగా గ్రౌండ్ వైపు ఆడేలా చూడటం లేదా వైడ్ యార్కర్లు వేయడం ఈ పిచ్‌పై మాకు కలిసి వస్తుందని భావించాను. మేము ఆ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయగలిగాము. వారి ప‌రుగుల వేగాన్ని ఓవ‌ర్‌కు 8 నుంచి 9 ప‌రుగుల‌కు ప‌రిమితం చేయ‌డం వ‌ల్ల వారు ఓవ‌ర్‌కు 10 ప‌రుగుల చొప్పున సాధించ‌కుండా అడ్డుకోగ‌లిగాం. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా వారిని 200 ప‌రుగుల లోపు ప‌రిమితం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం అని శ్రేయ‌స్ అయ్యర్ తెలిపాడు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!