Arnab Cyclone Effect School Holidays : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను అతితీవ్ర తుపానుగా మారి ఏపీవైపు దూసుకొస్తుంది. ఈ తుపాను కారణంగా ఇవాళ ఉదయం 11గంటల నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, 115 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో భీకరగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో ఇది మంగళవారం ఉదయం 11.30 నుంచి బుధవారం 11.30గంటల వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో తుపాను బలహీనపడి 29వ తేదీనాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, 30వ తేదీన అల్పపీడనంగా బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంగళవారం, బుధవారం రెండు రోజులు అత్యంత భారీ వర్షాలతోపాటు భీకర స్థాయిలో గాలులు వీస్తాయని, ఆ సమయాల్లో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తుపాను కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.


