E85, E100 ఇంధన వాహనాదారులకు గుడ్ న్యూస్.. నిబంధనల్లో కీలక మార్పులు.. కేంద్రం సవరణలు

Must read

Flex Fuel: పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక ప్రధాన అడుగు వేసింది. E85, E100 (Flex Fuel)వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు సంబంధించి ఉద్గార ప్రమాణాల ధ్రువీకరణలో స్పష్టత తెస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989లో కీలక మార్పులతో నోటిఫికేషన్ జారీ చేసింది. E85 అనేది గరిష్ఠంగా 85 శాతం ఇథనాల్‌తో కూడిన మిశ్రమం కాగా, E100 పూర్తిగా ఇథనాల్ ఇంధనం. ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా మాత్రమే ఇంధన శాతానికి అనుగుణంగా ఇవి సజావుగా పనిచేస్తాయి.

ముడి చమురు దిగుమతులకు కట్టడి.. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గించడమే లక్ష్యం:

దేశీయంగా తయారయ్యే ఇథనాల్ వాడకాన్ని పెంచడం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశం. అమెరికా, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతమైన ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ద్వారా వాహనాల నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను, ఎగ్జాస్ట్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ ఇంధన భద్రత సాధనకు ఇది ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

సాధార‌ణ వాహనదారులకు హెచ్చరిక.. E85, E100 ఇంధనాలు అన్ని కార్లకు వర్తించవు:

ఈ కొత్త మార్గదర్శకాలపై వాహనదారులు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ పెట్రోల్ వాహనాలు లేదా E10, E20 ఇంధనాలతో నడిచే పాత వాహనాలు E85 లేదా E100 ఇంధనాలకు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. తగిన ఇంజిన్ మార్పులు లేని వాహనాల్లో వీటిని ఉపయోగిస్తే ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్యూయల్ కంపాటిబిలిటీ స్టిక్కర్, యూజర్ మాన్యువల్‌ పరిశీలించిన తర్వాతే తయారీదారు అనుమతించిన ఇంధనాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేసింది.

పాత వాహన యజమానులపై ఎలాంటి నిబంధనలు లేవు.. బయోడీజిల్‌ మార్గదర్శకాలకు సవరణలు:

ఇప్పటికే మార్కెట్లో ఉన్న లేదా వాడుకలో ఉన్న పాత వాహనాల యజమానులు తమ ఇంజిన్లను E85 ఇంధనానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం లేదని, కేంద్రం ఎలాంటి నిర్బంధాలను విధించలేదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఈ సవరణల్లో అధిక ఇథనాల్ ఇంధనాలతో పాటు బయోడీజిల్‌ ఉద్గార నిబంధనలలో కూడా మరికొన్ని సాంకేతిక మార్పులు చేసారు. అధికారిక గెజిట్‌లో ప్రచురించిన నాటి నుంచే ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!