Arnab Cyclone : అతి తీవ్ర తుపాన్‌గా ఆర్నబ్.. ఏపీలోని కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు కుంభవృష్టి.. భీకర గాలులు..

Must read

Arnab Cyclone Updates : దేశ తూర్పుతీరంలో ఈ ఏడాది తొలి తుపాన్ సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచించిన పేరు ఆర్నబ్ పెట్టారు. ఈ ఆర్నబ్ అతి తీవ్ర తుపాన్‌గా మారి ఏపీవైపునకు దూసుకొస్తుంది. రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఒక రోజంతా తుపాన్ తీవ్రత అలాగే కొనసాగనుండడంతో నష్టం భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తాపై ఆర్నబ్ తుపాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. నేడు, రేపు పలు జిల్లాల్లో కుంభృష్టి, అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 115 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : Cyclone Arnab Impact : అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాక్‌.. వరుసగా రెండు రోజులు రైళ్లు రద్దు!

తుపాను ప్రభావంతో మంగళవారం, బుధవారం ఏపీతోపాటు దక్షిణ ఒడిశా వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మంగళవారం కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాతోపాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో ఇది మంగళవారం ఉదయం 11.30 నుంచి బుధవారం 11.30గంటల వరకు కొనసాగుతుందని, బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో తుపాను బలహీనపడి 29వ తేదీనాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, 30వ తేదీన అల్పపీడనంగా బలహీన పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం తుపాను యానాంకు సమీపంలో తీరందాటే అవకాశం ఉండగా.. దట్టమైన మేఘాల వల్ల దిశమారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే నెల్లూరు -మచిలీపట్నం మధ్య అర్నబ్ తుపాను తీరందాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆర్నబ్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అధిక ప్రభావం ఉండే జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. తుపాను సహాయ చర్యల నిమిత్తం రాష్ట్రంలోని 20 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం రూ.27కోట్లు విడుదల చేసింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!