TG SAFE Inspections : రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలను, నకిలీ, అనుమతిలేని ఔషధాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం టీజీ సేఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొద్దిరోజులుగా టీజీ సేఫ్ బృందాలు హైదరాబాద్ క్యూర్ పరిధిలో స్వీట్స్ దుకాణాలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. బూజుపట్టిన స్వీట్లు, అపరిశుభ్రత వాతావరణంలో పదార్థాల తయారీ, మత్తు మందుల విక్రయాలు, గడువు ముగిసిన FSSAI లైసెన్స్లతోనూ షాపులను నడుపుతున్నట్లు గుర్తించారు.
Also Read : Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు.. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే..
రాష్ట్రంలో రోజురోజుకు పెచ్చుమీరుతున్న ఆహార, ఔషధ కల్తీలపై ఉక్కుపాదం మోపేందుకు, ప్రజారోగ్యం పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం టీజీ సేఫ్‌ను ఏర్పాటు చేసింది. ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి టీజీ సేఫ్ ఏకీకృత పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో టీజీ సేఫ్ బృందాలు స్వీట్ దుకాణాలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, మెడికల్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో మత్తు, అనుమతిలేని, నాణ్యతలేని మందుల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు టీజీ సేఫ్ అధికారులు దృష్టిసారించారు. మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారా? అనే కోణంలో క్షేత్రస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో TG SAFE డ్రగ్స్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఏకంగా 16 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పలు ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ట్రామడాల్, ఆల్ప్రాజోలం వంటి మత్తు కలిగించే మందుల విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
గజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లో టీజీ సేఫ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హబ్సిగూడ, ఉప్పల్, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మేడిపల్లి, షామీర్పేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపులను తనిఖీ చేస్తున్నారు. అయితే, తనిఖీల్లో పలు మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు.. అర్హతలేని, వైద్యులు సూచించని మందులను విక్రయాలు చేస్తున్నట్లు టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. దీంతో సదరు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. షాపులను సీజ్ చేయడంతోపాటు.. లైసెన్సులు రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మరోవైపు.. క్యూర్ పరిధిలోని పలు స్వీట్ షాపుల్లో 12 బృందాలతో టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్ఫోర్సమెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర పరిసరాల్లో స్వీట్ల తయారీ, FSSAI లైసెన్స్ లేకుండా షాపుల నిర్వహణ, గడువు ముగిసిన స్వీట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో పురుగులు, ఫంగస్ ఉన్న పల్లీలు, స్వీట్లు కూడా అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. కొన్నింటికి షోకాజ్, ఇంప్రూవ్మెంట్ నోటీసుల జారీ చేశారు. ఇలా ఆహార పదార్థాల విక్రయించే దుఖానాల్లో, మెడికల్ షాపుల్లో టీజీ సేఫ్ అధికారులు వరుస తనిఖీలు చేస్తూ కల్తీని ప్రోత్సహించేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.


