YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసే గడువును మరో 48 గంటల పాటు పెంచాలని కోరుతూ వైఎస్సార్ (YSRCP)సీపీ నాయకులు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయిందని, అనేక నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకున్న తమ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడంతో పాటు గృహనిర్బంధాలు విధిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
MeeSeva Toll Free: ఇక ఇంటివద్దకే ‘మీ సేవ’ సేవలు.. టోల్‌ఫ్రీ నంబర్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు!
అభ్యర్థులపై దాడులు, అడ్డంకులు.. వైసీపీ తీవ్ర ఆరోపణలు:
విచారణ సందర్భంగా వైసీపీ న్యాయవాదులు ధర్మాసనం ముందు సంచలన వాదనలు వినిపించారు. నామినేషన్లు వేసేందుకు వస్తున్న తమ పార్టీ అభ్యర్థులను అధికార తెదేపా నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారని, వారిపై భౌతిక దాడులకు దిగుతూ నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని, విపక్ష అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు వేసేందుకు వీలుగా ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా, గొడవలు జరుగుతున్నందున జిల్లా పరిషత్, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ సోమవారానికి వాయిదా.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందన్న SEC:
కాగా, ఈ ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) న్యాయవాది స్పందిస్తూ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ సమయం ముగిసిపోయిందని కోర్టుకు స్పష్టం చేశారు. ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను ఆలకించిన న్యాయస్థానం, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎన్నికల నామినేషన్ల రగడ ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీయడంతో ఏపీ రాజకీయం తీవ్ర వేడెక్కింది.


