Shani Trayodashi Special: హిందూ సనాతన ధర్మంలో శని త్రయోదశికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి వచ్చే రోజూ శనిదేవుడిని ఆరాధించడానికి, శనిగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ససమయంగా భావిస్తారు. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆచరించే పూజలు, పరిహారాలు అత్యంత శక్తివంతమైన ఉపశమనాన్ని కలిగిస్తాయి. కర్మఫలదాత అయిన శనిభగవానుడిని భక్తిశ్రద్ధలతో ప్రసన్నం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పనుల్లో ఆలస్యాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి రోజున పాటించాల్సిన 8 ముఖ్యమైన పరిహారాలు, వాటి పూర్తి విధివిధానాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
శని త్రయోదశి రోజున విధిగా పాటించాల్సిన 8 ముఖ్యమైన పరిహారాలు:
1.ఉదయం స్నానం మరియు శనిదేవుని పూజ:
ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి తలారా స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసుకోవడం మంచిది. అనంతరం నల్లని వస్త్రాలు ధరించి, శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, నల్ల నువ్వులు లేదా బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.
2.తిలాభిషేకం, దానాలు:
సమీపంలో ఉన్న శని దేవాలయంలో(Shani Trayodashi Special) శనిదేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించడం శ్రేష్ఠం. ఒకవేళ ఆలయానికి వెళ్లలేని పరిస్థితి ఉంటే, పేదలకు లేదా పూజారులకు నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, గొడుగు లేదా ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయాలి.
3.నవగ్రహ ప్రదక్షిణలు:
శని త్రయోదశి పర్వదినాన నవగ్రహాల ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 9 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఈ సమయంలో శనిదేవుడికి నల్లని పుష్పాలు, మారేడు దళాలు సమర్పించడం ద్వారా గ్రహదోష తీవ్రత తగ్గుతుంది.
4.నల్ల నువ్వుల దీపారాధన:
ఇంట్లో లేదా ఆలయంలో నల్ల నువ్వుల నూనెతో ప్రమిదలో దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత (ప్రదోష కాలంలో) రావిచెట్టు కింద కానీ లేదా శని సన్నిధిలో కానీ దీపం వెలిగించడం వల్ల శనిగ్రహ దోషాల నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.
5.పేదలకు, జీవులకు అన్నదానం:
ఆకలితో ఉన్న పేదలకు నల్ల వస్త్రాలు, మినపప్పు, నువ్వులతో చేసిన వంటకాలను దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు. అలాగే కాకులకు నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెలు వేయడం, నల్ల కుక్కలకు ఆహారం అందించడం చాలా శుభకరం.
6.శని గాయత్రీ మంత్ర జపం:
పూజా సమయంలో లేదా ప్రశాంతమైన వాతావరణంలో శని గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి:
“ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి | తన్నో మందః ప్రచోదయాత్ ||”
7.హనుమాన్ చాలీసా పారాయణం:
శనిదేవుడికి భక్త ఆంజనేయుడంటే ఎంతో ప్రీతి. శని దోషాలు, మానసిక ఆందోళనలు తొలగిపోవడానికి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల శనిపీడ నుంచి విముక్తి లభిస్తుంది.
8.శని త్రయోదశి నియమాలు & ఉపవాసం:
ఈ రోజంతా సాధ్యమైనంత వరకు ఉపవాసం (నక్త వ్రతం) ఉండటం మంచిది. సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఉల్లి, వెల్లుల్లి లేని సాత్వికాహారం లేదా పరమాన్నం స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. మద్యమాంసాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.


