- దసరా రోజున అపరాజితా దేవిని పూజిస్తే విజయం వరిస్తుందా?
- అపరాజితా దేవి పూజా విధానం ఏంటి?
- విజయదశమి నాడు తప్పక చేయాల్సిన పనులేంటి?
- ఉద్యోగం, వ్యాపారంలో విజయం కోసం ఇలా పూజ చేయండి
Aparajita Devi Puja 2026 : విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. ఈ పర్వదినాన అపరాజితా దేవీని పూజిస్తే అఖండ విజయం కలుగుతుందని భక్తుల నమ్మకం.. అపరాజిత అంటే ఓటమి ఎరుగనిది అని అర్థం.
అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ పూజలో పుష్పార్చన, దీపారాధనతో పాటు పూజించిన (Aparajita Devi Puja ) పుష్పాలను వస్త్రంలో కట్టి భద్రపరిచే ఆచారం ఉంది. ఇంతకీ అపరాజితా దేవి పూజను ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? ప్రత్యేక పరిహారాలేంటి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అపరాజితా దేవి పూజా సమయం :
విజయదశమి రోజున అపరాజితా దేవి పూజను సంప్రదాయం ప్రకారం.. అపరాహ్ణ కాలంలో అంటే మధ్యాహ్నం తర్వాత నిర్వహిస్తారు. స్థానిక పంచాంగంలో సూచించిన విజయ ముహూర్తాన్ని అనుసరించడం మంచిది. పూజా సమయం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. మీ ప్రాంత పంచాంగాన్ని పరిశీలించి పూజా సమయాన్ని నిర్ణయించుకోవాలి.
అపరాజితా దేవి పూజా విధానం :
ముందుగా ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. అనంతరం అపరాజితా దేవి చిత్రపటం లేదా ప్రతిమను పూజా పీఠంపై ఉంచాలి. పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, దీపం, నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. అపరాజితా దేవి స్రోత్రం లేదా నమస్కార స్లోకాలు చదువుతూ పూజను పూర్తి చేయాలి.
Read Also : Shami Pooja Vidhanam : దసరా రోజు విజయ ముహూర్తం సమయంలో ఏం చేయాలి.. శమీ పూజ చేసే విధానం ఇదే..
సంకల్పం : దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, విద్యలో విజయం కలగాలని అమ్మవారిని మనసారా ప్రార్థించాలి.
పుష్పార్చన : నీలి పుష్పాలను అమ్మవారికి సమర్పించవచ్చు. అందుబాటులో లేకపోతే ఇతర పూలతోనూ పూజ చేయవచ్చు. శంఖుపుష్పి పూలను 9 లేదా 11 తీసుకోవాలి. ముందుగా వాటిని శుభ్రమైన పాత్రలో ఉంచి అమ్మవారికి సమర్పించాలి.
దీపారాధన : అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపం సమర్పించాలి. మీకు తెలిసిన దుర్గాదేవి స్తోత్రాలు లేదా నామాలను పఠించాలి.
నైవేద్యం : పండ్లు లేదా సాత్వికమైన నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వాలి.
ఈ పరిహారం ఆచరిస్తే అన్ని విజయాలే :
ప్రత్యేక ఆచారం ప్రకారం.. పూజించిన తర్వాత అపరాజిత (శంఖు) పుష్పాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన పసుపు వస్త్రంపై ఉంచాలి. ఆ పూలను వస్త్రంతో జాగ్రత్తగా మూటకట్టి ముడి వేయాలి. అనంతరం ఆ మూటను పూజా స్థలంలో ఉంచి అమ్మవారిని ప్రార్థించాలి. ఈ పుష్పమూటను పూజ అనంతరం మీ సంప్రదాయంలో సూచించిన శుభ్రమైన ప్రదేశంలో లేదా పూజా మందిరంలోని అలమారాలో భద్రపరచవచ్చు.
ఈ ఆచారం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండే శాస్త్రోక్త నియమం కాదు.. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించడం మంచిది. చివరగా అమ్మవారికి నమస్కరించి కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచాలి. ఈ అపరాజిత పూజను ఎవరికి తెలియకుండా, చెప్పకుండా, గుప్తంగా చాలా నిశబ్ధంగా చేయడం ఆచరించడం ద్వారా మీరు అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు..
అమ్మవారి స్తోత్రం :
హారేణ తు విచిత్రేణ భాస్వత్ కనకమేఖలా ।
అపరాజితా భద్రరతా కరోతు విజయమ్ మమ ॥
అపరాజితా దేవి పూజలో పాటించాల్సిన నియమాలివే :
1. పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
2. మీ కుటుంబ సంప్రదాయం, ఆచారాలకు అనుగుణంగా పూజ చేయాలి.
3. ఖరీదైన పూలు, ప్రత్యేక నైవేద్యాలు తప్పనిసరి అని భావించకూడదు.
4. పూజలో చిన్న పొరపాటు జరిగిందని భయపడకుండా, భక్తితో ప్రార్థన కొనసాగించాలి.
5. తాంత్రిక పరిహారాల పేరుతో చెప్పే ఆచారాలకు దూరంగా ఉండాలి.


