Yuzvendra Chahal : భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులపై తొలిసారి మనసు విప్పి మాట్లాడాడు. విడాకుల తర్వాత మద్యపానం తన జీవితంలో తీవ్ర సమస్యగా మారిందని, ఒక దశలో పరిస్థితి హద్దులు దాటిపోయిందని వెల్లడించాడు. ఈ అలవాటు తన క్రికెట్ కెరీర్ను కూడా దెబ్బతీస్తుందనే భయం కలగడంతో పునరావాస కేంద్రంలో చేరి చికిత్స తీసుకున్నట్లు తెలిపాడు. మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో పాడ్కాస్ట్ సంభాషణలో చాహల్ ఈ విషయాలను పంచుకున్నాడు.
విడాకుల తర్వాత తన మానసిక పరిస్థితి బాగోలేదని, మద్యపానం మరింత పెరిగిందని చాహల్ వివరించాడు. మద్యపాన అలవాటు అదుపు తప్పడంతో గత ఏడాది కౌంటీ క్రికెట్ తర్వాత పునరావాస కేంద్రంలో చేరినట్లు చాహల్ చెప్పాడు. అక్కడ 26రోజుల పాటు ఉన్నానని వెల్లడించాడు. ఆ నిర్ణయం తన వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకున్నానని వివరించాడు. ప్రస్తుతం తన పరిస్థితిని మెరుగ్గా నిర్వహించగలుగుతున్నానని పేర్కొన్నాడు.
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులతో పాటు ఆందోళన, పానిక్ అటాక్స్ వంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు చాహల్ వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చలు, ప్రజల దృష్టి తనపై ఉండటం కూడా ఒత్తిడిని పెంచాయని తెలిపాడు. ఆ కఠిన సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుడు తనకు అండగా నిలిచారని చెప్పాడు. వారి మద్దతు తనను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడంలో సహాయపడిందని వివరించాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందిన చాహల్, మైదానం వెలుపల తాను ఎదుర్కొన్న సమస్యలను బహిరంగంగా పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత సమస్యలు ఎంత తీవ్రమైనవైనా, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం, కుటుంబ సభ్యుల మద్దతును స్వీకరించడం ఎంత ముఖ్యమో అతడి అనుభవం తెలియజేస్తోంది. చికిత్స తీసుకున్న తర్వాత తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతున్నానని, క్రికెట్పై మళ్లీ దృష్టి పెట్టగలిగానని చాహల్ తెలిపాడు.


