Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి వెళ్తున్న భక్తులపై అదుపుతప్పిన ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గ్వాలియర్లోని శీత్లా మాత ఆలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛినోర్ వైపు నుంచి ధాన్యంతో వస్తున్న ట్రక్కు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ట్రక్కు పోలీసుల బారికేడ్లను దాటుకుని వాలుగా ఉన్న రహదారిపై నుంచి కిందకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న భక్తులను ఢీకొట్టి, ఆలయ బయట గోడ, గేటును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ప్రమాదంలో గాయపడిన మొత్తం 39 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు గ్వాలియర్ సీనియర్ పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించారు. వారిలో 12 మంది మరణించగా, ఐదుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా గాయాలయ్యాయని, వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.
శరన్నవరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు, పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ ట్రక్కు అక్కడికి ఎలా చేరుకుందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాహనంలో సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై ఆర్టీవో అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
#WATCH | Madhya Pradesh | Early morning visuals from the spot where a truck ran over several people near Sheetla Mata Mandir in Gwalior, claiming the lives of 11 people and leaving 29 people injured https://t.co/zyoabIhQ8a
— ANI (@ANI) October 18, 2026


