AP Municipal Elections 2026 : ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా.. నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 100 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ తరువాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లకు అనుమతిస్తారు.
Also Read : Rain Alert : ఈశాన్య రుతుపవనాలు ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు..
రాష్ట్రంలో మొత్తం 123 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉండగా.. వీటిలో ప్రస్తుతం 100 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో మాత్రమే నామినేషన్ల ప్రక్రియ నేటి ప్రక్రియ మొదలవుతుంది. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు పోటీకి అభ్యర్థులు సిద్దమవుతుండగా.. 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,485 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, తొలిదశలో ఎన్నికలు నిర్వహించని 23 పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ శుక్రవారంతో పూర్తికానుంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసేలోగా 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు జరిగింది. మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి టీడీపీ 89 చోట్ల, జనసేన 25 చోట్ల, బీజేపీ 9 చోట్ల పోటీ చేయనున్నాయి. సీట్ల లెక్క తేలడంతో.. నేడు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. మరోవైపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లకు, 14 మున్సిపాలిటీలకు, ఆరు నగర పంచాయతీలకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన పార్టీలకి గతంలో కేటాయించిన గుర్తులు తిరిగి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.


