
Global Petrol Prices : దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులు తమ వాహనం బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. క్రమక్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర మనం ఊహించలేనంత తక్కువగా ఉంది. అక్కడ రూ.3 లోపే లీటర్ పెట్రోల్ లభిస్తుండటం విశేషం.
Also Read : CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే.. ఎల్‌నినో ప్రభావంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశాలు, ఇంధనంపై భారీగా ప్రభుత్వ రాయితీలు కల్పించే దేశాల్లో ధరలు తక్కువగా ఉంటున్నాయి. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ గణాంకాల ఆధారంగా ప్రపంచంలో అత్యంత చౌకగా పెట్రోల్ విక్రయించే దేశాల్లో లిబియా, ఇరాన్, వెనిజులా అగ్రస్థానాల్లో ఉన్నాయి. అక్టోబర్ 2026 నాటి నివేదిక ప్రకారం లిబియాలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.2.21 కాగా, ఇరాన్లో రూ.2.71గా ఉంది.
లిబియా, ఇరాన్లలో ఇంత తక్కువ ధరకు పెట్రోల్ లభించడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లోని చమురు నిల్వలు, ప్రభుత్వ విధానాలు. లిబియాలో భారీగా చమురు నిల్వలు ఉండటంతో పాటు ప్రభుత్వం ఇంధన ధరలను తక్కువగా ఉంచేందుకు రాయితీలు అందిస్తోంది. ఇరాన్‌లోనూ దేశీయంగా చమురు ఉత్పత్తి అధికంగా ఉండటం, ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇవ్వడం వల్ల పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి.
ఈ రెండు దేశాల తర్వాత వెనిజులా కూడా చౌక ఇంధనం అందించే దేశాల జాబితాలో నిలుస్తోంది. అయితే తక్కువ ధరలకు పెట్రోల్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ దేశాల్లో రాజకీయ అస్థిరత, ఆర్థిక పరిస్థితులు, ఇంధన సరఫరాకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అందువల్ల తక్కువ ధరలో పెట్రోల్ లభించడం ఒక్కటే ఆ దేశాల్లో జీవన వ్యయం తక్కువగా ఉందని చెప్పడానికి ప్రామాణికం కాదు.
అంతర్జాతీయ గణాంకాల ప్రకారం అంగోలా, కువైట్, అల్జీరియా, తుర్క్మెనిస్తాన్, ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాల్లోనూ పెట్రోల్ ధరలు అనేక దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. లిబియాలో లీటర్ పెట్రోల్ రేటు రూ.2.21 కాగా.. ఇరాన్ లో రూ.2.71గా ఉంది. వెనిజులాలో రూ.3.32 కాగా.. అంగోలాలో లీటర్ ధర సుమారు రూ.31, కువైట్‌లో రూ.32, అల్జీరియాలో రూ.33గా ఉన్నాయి. అదేవిధంగా తుర్క్మెనిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.40 కాగా.. ఈజిప్ట్‌లో రూ.43, ఖతార్‌లో రూ. 54 కాగా.. బొలీవియాలో లీటర్ పెట్రోల్ ధర రూ.56గా ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు, ప్రభుత్వ రాయితీల మార్పులు, స్థానిక పన్నులు వంటి అంశాల కారణంగా ఈ జాబితాలో దేశాల స్థానాలు, పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలతో పాటు దేశీయ పన్నులు, రవాణా ఖర్చులు, డీలర్ కమిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల విధానం వంటి అంశాలు పెట్రోల్ రిటైల్ ధరను ప్రభావితం చేస్తాయి. చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు తమ ప్రజలకు భారీ సబ్సిడీలు అందిస్తుండగా, భారత్‌లో పెట్రోల్ ధరలో పన్నుల వాటా కూడా కీలకంగా ఉంటుంది. అందుకే చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఇతర దేశాల నుంచి చమురు నిల్వలను దిగుమతి చేసుకోవాల్సి రావడం, తదితర ఖర్చుల కారణంగా పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.


