పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

Must read

సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి, గాయని శ్రుతి హాసన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ముక్కుసూటిగా మాట్లాడే శ్రుతి.. తాజాగా నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో తన వివాహం, వ్యక్తిగత స్వేచ్ఛ, మాతృత్వం వంటి అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఒకప్పుడు పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లిన విషయాన్ని ఆమె వెల్లడించారు.పెళ్లి అనే బంధానికి తాను పూర్తిగా వ్యతిరేకం కాదని శ్రుతి హాసన్ స్పష్టం చేశారు. అయితే తన జీవితాన్ని ఒక నిర్దిష్టమైన సామాజిక చట్రంలోకి పరిమితం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. జీవిత భాగస్వామితో కలిసి ఉండటం, ఒకరినొకరు ప్రతిరోజూ ఎంచుకోవడం తనకు నచ్చుతుందని.. అయితే దానికి తప్పనిసరిగా చట్టపరమైన పత్రాలు, భారీ వేడుకలు అవసరమా? అనే సందేహం తనకు ఉందని వివరించారు.

ఇదే సందర్భంలో తన జీవితంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లినట్లు శ్రుతి వెల్లడించారు. పెళ్లి నిర్ణయానికి చాలా దగ్గరగా వెళ్లినా చివరికి ఆ బంధాన్ని కొనసాగించలేదని చెప్పారు. పెళ్లి విషయంలో తనకు ఉన్న ప్రధాన ఆందోళన బంధం కంటే.. దానితో ముడిపడే సామాజిక అంచనాలు, ఆడంబరాలు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలేనని ఆమె వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.అలాగే పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేసే విధానంపైనా శ్రుతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెద్ద ఎత్తున వివాహ వేడుకలు నిర్వహించే వారిని తాను విమర్శించడం లేదని చెబుతూనే.. కేవలం ఆడంబరాలు, ప్రదర్శన కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం తనకు అర్థం కాదని అన్నారు. అలాంటి మొత్తాన్ని అవసరాల్లో ఉన్నవారికి లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఇక మాతృత్వం గురించి కూడా శ్రుతి హాసన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో తల్లిగా మారాలని తనకు ఎంతో కోరికగా ఉందని చెప్పారు. అయితే తల్లితనాన్ని అనుభవించడానికి తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె భావిస్తున్నారు. అవసరమైతే బిడ్డను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అదే సమయంలో జీవసంబంధమైన మాతృత్వాన్ని కూడా అనుభవించాలని తనకు కోరిక ఉందని చెప్పారు.

శ్రుతి హాసన్ గతంలోనూ తన వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనల గురించి బహిరంగంగా మాట్లాడారు. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి, ప్రేమ, మాతృత్వం వంటి విషయాల్లో తన ఆలోచనలు ఇతరుల అంచనాలకు భిన్నంగా ఉన్నాయని శ్రుతి మరోసారి స్పష్టం చేసినట్టుగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!