ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. ‘బేబీ’ సినిమాతో ఈ జోడీకి మంచి క్రేజ్ రావడం, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ‘ఎపిక్’పై మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ‘90s’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించడం, నాగవంశీ నిర్మాణంలో సినిమా తెరకెక్కడం, ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? చూద్దాం.
కథ
‘90s’లో చిన్నపిల్లాడిగా కనిపించిన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) పెద్దయ్యాక జీవితంలో పెద్దగా స్థిరపడకుండా దర్శకుడు కావాలనే కలతో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాడు. తండ్రి సూచనతో అప్పు చేసి మరీ లండన్‌లో చదువుకోవడానికి వెళ్తాడు. అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి డబ్బు పంపించే ప్రయత్నం చేస్తుంటాడు.ఈ క్రమంలో అతడికి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య మొదట పరిచయం ఏర్పడినప్పటికీ, కులాలు వేరు కావడంతో ప్రేమలో పడకూడదని నిర్ణయించుకుంటారు. అయినప్పటికీ క్రమంగా ఒకరికి ఒకరు దగ్గరవుతారు. ఆ తర్వాత వారి సంబంధం ఎలాంటి మలుపులు తిరిగింది? లండన్‌లో వారి జీవితాలు ఎలా మారాయి? చివరకు వారి బంధం ఎక్కడికి చేరింది? అనేది సినిమా కథ.
విశ్లేషణ
90sలో పెరిగిన ఓ తెలుగు యువకుడు విదేశాలకు చదువు కోసం వెళ్లిన తర్వాత ఎదుర్కొనే పరిస్థితులను ప్రేమకథతో ముడిపెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే ఆదిత్య లండన్‌కు వెళ్లడం, కొత్త వాతావరణంలో ఇమడేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత కడలితో పరిచయం కావడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది.ఆనంద్, వైష్ణవి మధ్య పరిచయం ఏర్పడే విధానం కొంతవరకు సహజంగా అనిపించకపోయినా, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. ఇప్పటికే ‘బేబీ’లో ఈ జంటను చూసిన ప్రేక్షకులకు వారి కాంబినేషన్ మరోసారి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.ఫస్టాఫ్‌లో సినిమా ప్రధానంగా ఇద్దరి మధ్య ఏర్పడే బంధం, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సమస్యల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా లొకేషన్లు మార్చకుండా కొన్ని పరిమిత ప్రదేశాల్లోనే కథను నడిపిస్తూ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం చేశారు.ఇప్పటి జెన్‌జీ రిలేషన్‌షిప్స్, కమిట్‌మెంట్ లేకుండా సంబంధాలను కొనసాగించాలనే ఆలోచన, ఆ తర్వాత ఎదురయ్యే భావోద్వేగ సమస్యలను దర్శకుడు కథలో భాగంగా చూపించాడు. ‘నో స్ట్రింగ్స్ అటాచ్డ్’ అనే ఆలోచనతో మొదలయ్యే బంధం తర్వాత ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు.అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో కథనం కొంత నెమ్మదిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటనే విషయంలో కొంత అయోమయం కలిగేలా కథనం సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగదీసిన భావన కలుగుతుంది.
క్లైమాక్స్ కూడా సినిమాకు ప్రధాన మైనస్‌గా నిలుస్తుంది. ఏదో ఒక విధంగా కథను ముగించాల్సి ఉందన్నట్టుగా క్లైమాక్స్‌ను పూర్తి చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సీక్వెల్ ఉంటుందనే విషయం ముందే తెలిసినప్పటికీ, ఈ భాగానికి కూడా బలమైన ముగింపు ఇచ్చి ఉంటే ప్రేక్షకులకు మరింత సంతృప్తి కలిగేది.సినిమాలో ప్రేమ, రిలేషన్‌షిప్‌తో పాటు కులాంతర సంబంధాలు, విదేశాల్లో చదువుకునే యువత ఎదుర్కొనే ఒత్తిడి, ఉద్యోగం కోసం ప్రయత్నించే సమయంలో అబ్బాయిలు ఎదుర్కొనే స్ట్రెస్, అమ్మాయిలకు సంబంధించిన శారీరక, మానసిక ఒత్తిళ్లను కథలో భాగంగా చూపించిన విధానం కొంత కొత్తగా అనిపిస్తుంది.అయితే సినిమాలో ముద్దు, ఇంటిమేట్ సన్నివేశాలు ఉండటంతో ఇది పూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రూపొందిన సినిమా కాదు. యువత, ఫ్రెండ్స్ లేదా లైఫ్ పార్ట్‌నర్స్‌తో చూడటానికి ఎక్కువగా సరిపోయే కంటెంట్‌గా అనిపిస్తుంది.
నటీనటులు
ఆనంద్ దేవరకొండ తన పాత్రలో బాగా నటించాడు. అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడే అమాయక యువకుడిగా, అనుకోకుండా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులను చక్కగా పలికించాడు.వైష్ణవి చైతన్యకు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. మరోసారి తనకు బాగా సూటయ్యే పాత్రలో ఆమె ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్లస్‌గా నిలిచింది.శివాజీ, వాసుకి పాత్రలు పరిమితంగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో ఒక సన్నివేశం భావోద్వేగాన్ని పండిస్తుంది. ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ స్క్రీన్‌పై కనిపించి తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు.
టెక్నికల్ టీమ్
హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ ముఖ్యంగా లండన్ లొకేషన్లను అందంగా చూపించడంలో సక్సెస్ అయింది.దర్శకుడు ఆదిత్య హాసన్ విషయానికి వస్తే.. దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు కొట్టేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సెకండాఫ్‌ను డీల్ చేయడంలో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా..
‘ఎపిక్’లో కొత్త తరహా రిలేషన్‌షిప్‌ను చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆనంద్, వైష్ణవి కెమిస్ట్రీ, ఫస్టాఫ్, పాటలు, డైలాగ్స్ సినిమాకు బలం. అయితే సెకండాఫ్‌లో నెమ్మదించే కథనం, ఊహించిన స్థాయిలో లేకపోయిన క్లైమాక్స్ సినిమాకు మైనస్. మొత్తంగా చూస్తే యూత్‌ను టార్గెట్ చేసిన రిలేషన్‌షిప్ డ్రామాగా ‘ఎపిక్’ ఒకసారి చూడొచ్చు.


