Thursday, September 3, 2026

YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్‌ జగన్ సంచలన వ్యాఖ్యలు

Must read

Ys Jagan Criticizes Chandrababu Over Polavaram Project And Water Release

YS Jagan: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు డ్రామాలు మానేసి పనులపై దృష్టి పెట్టాలని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలోని ఇప్పటికే ఉన్న పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి, పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేసి.. పోలవరం నీళ్లు తెచ్చేశామంటూ ప్రచారం చేస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. పోలవరం రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావని చంద్రబాబుకూ తెలుసని జగన్ అన్నారు. ప్రస్తుతం విడుదలవుతున్న నీరు పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు చెందినదని, ఆ కాలువను వైఎస్సార్ హయాంలోనే నిర్మించారని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. పురుషోత్తపట్నం పంపుల ద్వారా 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, ఆ ప్రాజెక్టు, పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవేనని అన్నారు.

పోలవరం పనుల్లో 79 శాతం అప్పుడే పూర్తయ్యాయి
పోలవరం ఎడమ కాలువ ప్రధాన పనుల్లో 79 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పనులపై నిలబడి అంతా తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై వరుసగా పబ్లిసిటీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారని, మొన్న వెలిగొండ, ఇవాళ పోలవరం ఎడమ కాలువ, మరో రోజు మరో ప్రాజెక్టు అంటూ విమర్శలు గుప్పించారు. ప్రారంభించని, పూర్తికాని ప్రాజెక్టులకు చంద్రబాబు తన పేరు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అరకొర పనులు చేసి అంచనాలు పెంచి దోచుకోవడమే ఆయన ధోరణి అని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మోడస్ ఆపరండీ ఇదేనని జగన్ విమర్శించారు.

2014–19లో పోలవరాన్ని చెల్లాచెదురు చేశారన్న జగన్
2014–19 మధ్య పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన డ్రామాలు, అబద్ధాలు, తప్పిదాలు, అవినీతి, దోపిడీ రాష్ట్రానికి శాపంగా మారాయని జగన్ ఆరోపించారు. సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు లేకుండా పనులు చేపట్టారని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దేందుకు తమ ఐదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని జగన్ పేర్కొన్నారు. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. స్పిల్‌వే పనులు పూర్తికాకముందే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే డయాఫ్రంవాల్ పనులు చేపట్టారని అన్నారు. అసంపూర్తి స్పిల్‌వే, కాఫర్ డ్యాం కారణంగా వరద నీటిని డైవర్ట్ చేయలేకపోయారని, కాఫర్ డ్యాం గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకెళ్లడంతో డయాఫ్రంవాల్ దెబ్బతిందని జగన్ పేర్కొన్నారు. వరదల కారణంగా మెయిన్ డ్యాం పునాదులకు నష్టం జరిగిందని ఆరోపించారు.

తమ హయాంలో ప్రణాళికాబద్ధంగా పనులు చేశామన్న జగన్
తమ ప్రభుత్వ హయాంలో ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు పూర్తి చేశామని జగన్ తెలిపారు. కాఫర్ డ్యాంలను పూర్తిచేసిన తర్వాతే మెయిన్ డ్యాం పనులను ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ప్రణాళికాబద్ధంగా చేపట్టామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టును సవ్యంగా ముందుకు తీసుకెళ్లడం లేదని, మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారని చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు.

పోలవరం ఎత్తుపై జగన్ ప్రశ్నలు
పోలవరం ఎత్తు విషయంలో స్పష్టత ఇవ్వాలని చంద్రబాబును జగన్ డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి స్థాయి రిజర్వాయర్ స్థాయి (FRL) 45.72 మీటర్లు కాగా, నీటి నిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారని అన్నారు. 41.15 మీటర్ల వరకు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తామని చెబుతోందని పేర్కొన్నారు. అలాంటప్పుడు పూర్తి స్థాయి పోలవరం ఎలా పూర్తవుతుందని, ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారని జగన్ ప్రశ్నించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయి ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారో కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై ప్రశ్నలు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపైనా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2009లో వైఎస్సార్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అనంతరం మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో అంచనాలను రూ.17,050.20 కోట్లకు సవరించామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో కీలకమైన ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లామని జగన్ పేర్కొన్నారు. భూసేకరణ కోసం ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై ప్రేమ కేవలం ప్రసంగాల్లోనేనా అని నిలదీశారు.

45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయాలని డిమాండ్
పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు పరిమితం చేయకుండా నిర్దేశిత 45.72 మీటర్ల ఎత్తులో పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యమవుతుందని, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడంతో పాటు కుడి, ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చని అన్నారు. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలతో సంబంధం లేకుండానే గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చని జగన్ పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువతో పాటు కుడి కాలువకు కూడా పుష్కలంగా నీరు అందించవచ్చని అన్నారు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీటిగా చూపిస్తూ ఇన్ని ప్రచార కార్యక్రమాలు ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం విషయంలో డ్రామాలు మానేసి ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టాలని, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తుతో ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!