Friday, June 19, 2026

బీఆర్ఎస్ అనే పుస్తకాన్ని మూసేశా.. తెలంగాణ రక్షణ సేనతో కొత్త చరిత్ర రాస్తా: కవిత

Must read

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కానీ, ఆ పార్టీతో కానీ తిరిగి కలిసే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ జీవితంలో ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను ఇప్పటికే పూర్తిగా మూసేశానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ రక్షణ సేన ద్వారానే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని, కొత్త చరిత్రను సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా అనే ప్రశ్నకు కవిత స్పందించారు. జీవితంలో కొన్నిసార్లు పేజీలు తిప్పాల్సి వస్తుందని, మరికొన్ని సందర్భాల్లో పుస్తకాలనే మూసివేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అనే పుస్తకాన్ని తాను ఇప్పటికే మూసేశానని, ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో తనకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయని కవిత తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం, ఉద్యమకారులకు తగిన గుర్తింపు వంటి అంశాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయిందని విమర్శించారు. ప్రాంతీయ భావజాలం నుంచి దూరం కావడమే బీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం కలిగించిందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించేందుకే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా క్రియాశీలకంగా లేవని విమర్శించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే తమ లక్ష్యమని చెప్పారు.ఢిల్లీ మద్యం కేసు అంశంపై కూడా స్పందించిన కవిత, తనపై దిగువ కోర్టులో ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అంశాలు న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నాయని, న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.తెలంగాణ రాజకీయాల్లో తన కొత్త ప్రయాణం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!