Saturday, June 6, 2026
Google search engine

తమిళనాడులో విజయ్ రాజకీయ సంచలనం..

Must read

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులకు నాంది పలుకుతూ, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని బ్లాక్‌బస్టర్ విజయంగా మార్చుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత ప్రదర్శన చేసింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మేజిక్ ఫిగర్‌కు టీవీకే కేవలం 10 స్థానాల దూరంలో నిలిచింది. మొదటి ఎన్నికలలోనే ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడం అరుదైన విషయం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ రాజకీయ పార్టీలకు ఇది గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో టీవీకే సాధించిన ఓట్ షేర్ కూడా విశేషంగా నిలిచింది. పార్టీకి ఏకంగా 34.92 శాతం ఓట్లు లభించడం విశేషం. 2000 సంవత్సరం తర్వాత దేశంలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక పార్టీ ఇంత భారీ ఓట్ షేర్ సాధించడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది విజయ్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా భావిస్తున్నారు.

గతంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీల తొలి ప్రదర్శనలను పరిశీలిస్తే, టీవీకే విజయం ఎంత గొప్పదో అర్థమవుతుంది. 2013లో ఢిల్లీలో తొలి సారి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 29 శాతం ఓట్ షేర్‌తో 28 స్థానాలు గెలుచుకుంది. అలాగే, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తొలి ఎన్నికల్లో 27.9 శాతం ఓట్ షేర్‌తో 70 సీట్లు దక్కించుకుంది. ఇక 2004లో కే. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 6.7 శాతం ఓట్ షేర్‌తో 26 స్థానాలు గెలిచింది. ఈ గణాంకాలతో పోల్చితే, విజయ్ పార్టీ తొలి ఎన్నికల్లోనే చరిత్ర సృష్టించిందని స్పష్టమవుతోంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఈ ఎన్నికల్లో పూర్తిగా తలకిందులయ్యాయి. చాలా సర్వే సంస్థలు టీవీకే పార్టీకి 0 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. అయితే, ప్రముఖ సర్వే సంస్థ ‘యాక్సిస్ మై ఇండియా’ మాత్రం విజయ్ ప్రభంజనాన్ని ముందుగానే అంచనా వేసింది. ఆ సంస్థ టీవీకేకు 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!