Friday, June 26, 2026

చంద్రబాబు, పవన్, లోకేశ్ నుండి బీజేపీ కొత్త అధ్యక్షులకు శుభాకాంక్షలు

Must read

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్. రామచందర్ రావు నియమితులైన నేపథ్యంలో ఆయనకూ మిత్రపక్షాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా మాధవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త బాధ్యతల్లో మీరు రాణించాలని కోరుకుంటున్నాను. కూటమిలోని మూడుపార్టీల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. కూటమి భాగస్వామ్యాల మధ్య పరస్పర సహకారం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా మాధవ్‌ను అభినందించారు. విద్యార్థి దశ నుంచే మాధవ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారని, ఎమ్మెల్సీగా యువత, నిరుద్యోగ సమస్యలపై శక్తివంతంగా స్పందించారని పవన్ పేర్కొన్నారు. జాతీయవాద దృక్పథంతో మాధవ్ రాష్ట్ర కూటమిని ముందుకు నడిపించగలరన్న నమ్మకం తనకుందని అన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. రామచందర్ రావుకు కూడా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, అనంతరం ఎమ్మెల్సీగా ప్రజల సమస్యలపై రామచందర్ రావు విశేషంగా పని చేశారని గుర్తు చేశారు. కేంద్ర పథకాల‌ను రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేశ్ కూడా స్పందిస్తూ మాధవ్, రామచందర్ రావులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం వినిపించిన అనుభవజ్ఞులని తెలిపారు. తమ అనుభవంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!