Friday, March 6, 2026
spot_imgspot_img

తొలి ఏకాదశి విశిష్టత

Must read

ఆషాఢ శుద్ధ ఏకాదశి… హిందూ ధార్మిక పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన రోజు. ఇది సంవత్సరంలో వచ్చే తొలి ఏకాదశిగా భావించబడుతుంది. “తొలి ఏకాదశి” అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. హిందూ పురాణాలు తెలిపిన ప్రకారం ఈ రోజున భగవంతుడు శ్రీమహావిష్ణువు శయన నిద్రలోకి వెళతాడు. ఈ నిద్రనుంచి కార్తీక శుద్ధ ఏకాదశినాడు ప్రభుద్దుడవుతాడు. ఈ నలుగురు నెలల కాలాన్ని భక్తులు తీవ్ర ఆధ్యాత్మిక సాధనకు వినియోగిస్తారు.

ఈ రోజు ఉపవాసవ్రతంతో పాటు విష్ణు నామస్మరణ, సహస్రనామ పారాయణ, పూజాపాఠాలతో భక్తులు జీవితాన్ని పవిత్రం చేసుకుంటారు. భక్తులు ఉదయం పుణ్యస్నానం చేసి, ఉపవాసంతో, నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు. కొందరు పూర్తి ఉపవాసం పాటిస్తే, మరికొందరు ఏకభుక్త వ్రతం పాటించడం ద్వారా తమ భక్తిని చాటుతారు. రాత్రి వేళ జాగరణ చేయడం ద్వారా భగవంతుని సేవలో నిమగ్నమవుతారు.

పద్మపురాణంలో చెప్పబడిన హేమమాలి గాథ ఈ వ్రతానికి మరింత గౌరవాన్ని అందించిందని పండితులు చెబుతున్నారు. స్వామి సేవను మరిచి విలాసంలో లీనమైన హేమమాలికి శాపం ఏర్పడుతుంది. భూమికి పతనం అయిన అతను ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పునర్జన్మ నుంచి విముక్తి పొందాడు. ఈ కథ ద్వారా ఏకాదశి వ్రతం ఎంతటి మహత్తరమైనదో అర్థమవుతుంది.

చాతుర్మాసం ప్రారంభమయ్యే ఈ తొలి ఏకాదశినాడు సన్యాసులు, మఠాధిపతులు స్థిరంగా ఒకచోట ఉండి జప, తపస్సులలో నిమగ్నమవుతారు. సాధకులు కూడా ఈ కాలంలో మాంసాహారం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. పుణ్యకాలంగా భావించే ఈ నాలుగు నెలలు సాధనకు, ఆచరణకు, ఆత్మనిర్ణయానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

ఈ సందర్భంగా భక్తులు “వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, రాష్ట్రం సుఖశాంతులతో కళకళలాడాలని” దేవునిని ప్రార్థిస్తున్నారు. “తొలి ఏకాదశి” రోజును ఆధ్యాత్మికంగా వేడుక చేసుకుంటూ, ప్రజలు తమ జీవితాల్లో శుభాన్నే ఆహ్వానిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!