Friday, March 6, 2026
spot_imgspot_img

హుజురాబాద్ ప్రజలే నా బలం, కార్యకర్తలు కుంగిపోవద్దు: ఈటల

Must read

హుజురాబాద్ ప్రజలు తనకు మించిన శక్తి లేదని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనకు స్ట్రీట్ ఫైట్ అవసరం లేదని, స్ట్రెయిట్ ఫైట్ చేయడానికే సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. “మీదికి ఒక మాట, లోపల మరో మాట మాట్లాడటం నాకు రాదు. బాజప్తా మాట్లాడతా కానీ బేజాప్తా కాదు,” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు సహజమని, 2021 నుంచి బీఆర్‌ఎస్‌లో నరకం అనుభవించానని తెలిపారు. “మనంగా బీఆర్ఎస్‌ నుంచి బయటకురాలేదు, వెళ్లగొట్టారు. కార్యకర్తల ఆవేదన నాకు అర్థమైంది. వారి రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను,” అని స్పష్టం చేశారు.

“సైకో, శాడిస్ట్ ఎవడో.. ఎవరి అండతో ధైర్యంగా ఉన్నాడో చూడాలి. బీ కేర్‌ఫుల్ బిడ్డా… నా చరిత్ర ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు, ఓపిక ఎంతవరకు పట్టాలో తెలుసు,” అంటూ ప్రత్యర్థులకు ఘాటు హెచ్చరికలు చేశారు.

హుజురాబాద్ నియోజకవర్గం తాను అడుగు పెట్టని గ్రామం లేదని, అక్కడ తనకు మక్కువెక్కువగా ఉందని వెల్లడించారు. “హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 53 వేల మెజార్టీ రావడానికి నేను కారణం. వ్యక్తులు ఎదగకపోతే పార్టీ బలపడదు,” అన్నారు.

“ఏ పార్టీలో ఉన్నా అంకితభావంతో పనిచేస్తాను. పదవులే పరమావధిగా భావించను. నా అనుభవాన్ని వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది,” అని ఈటల రాజేందర్ తెలిపారు.

కొత్త వాళ్లు, పాత వాళ్లు అనే భావనకు తాను దూరమని, కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారని, వారి గురించి బాధపడవద్దని కార్యకర్తలకు సూచించారు.

“హుజురాబాద్‌లో నెలకు కనీసం పదిరోజులు ఉంటా. ప్రతి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తా. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది. కార్యకర్తలు కుంగిపోవద్దు,” అంటూ ఓర్పుతో, ధైర్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!