Friday, March 6, 2026
spot_imgspot_img

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీదే: మంత్రి నారా లోకేష్

Must read

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో టిడిపి కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌ను రూపొందించి సూపర్ హిట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, తనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఎప్పటికీ టిడిపి కార్యకర్తలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు తాను శిరస్సు వంచి వందనం చేస్తున్నానని తెలిపారు. అంజిరెడ్డి తాత, మంజులక్క, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీ వంటి నేతలు తనకు స్ఫూర్తి అని లోకేష్ పేర్కొన్నారు.

కడప జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి చరిత్ర సృష్టించిందీ కార్యకర్తల శ్రమ వలనేనని ఆయన తెలిపారు. పులివెందులలో ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల ఎమ్మెల్యేకు ప్రజలు ఇప్పుడు మాత్రమే గుర్తుకువస్తున్నారని, తన సొంత కార్యకర్తలను కూడా జగన్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. ఉల్లికి మద్దతు ధర ఇప్పుడే గుర్తుకొచ్చిందని, ఉల్లిగడ్డ–ఆలుగడ్డ తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు.

పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి వంటి పథకాలను అమలు చేసి ఇచ్చిన హామీలను టీడీపీ నెరవేర్చిందని లోకేష్ గుర్తు చేశారు. కొప్పర్తిలో కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించే విధంగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు కంపెనీలు ప్రారంభమయ్యాయని, రైతులు ఇచ్చిన భూములను సరైన రీతిలో వినియోగించి కడపను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. హత్యా రాజకీయాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించలేదని, పెట్టుబడులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రజలు మనల్ని ఏ ఆశయంతో గెలిపించారో, దానిని నెరవేర్చడమే తమ లక్ష్యమని అన్నారు.

కడప జిల్లాను టీడీపీ కంచుకోటగా మార్చేందుకు నేతలు, కార్యకర్తలు అహంకారం విడిచి కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ సూచించారు. కమలాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ప్రజల కోసం తాను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!