తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర పరిస్థితులపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పథకాలు అన్నీ ఫెయిల్
రామచందర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన పథకాలేవీ విజయవంతం కాలేదని, ప్రజలతో మోసం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. “తులం బంగారం పథకం ఏం అయింది?” అంటూ కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య ఎలాంటి తేడా లేదని, రెండూ ఒకే తరహా పార్టీలు అని వ్యాఖ్యానించారు.
బీజేపీకి కార్యకర్తలే బలం
“మా కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అన్యాయం చేయదు. నేనూ ఒక కార్యకర్తనే. నన్ను గెలిపించింది మా కార్యకర్తలే” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు తగిన ప్రాధాన్యం బీజేపీ ఇస్తుందని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీపై సూటి వ్యాఖ్యలు
ఒక విలేఖరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చోరీ గురించి ప్రశ్నించగా, రామచందర్ రావు వ్యంగ్యంగా స్పందించారు. “రాహుల్ గాంధీకి మెదడు చోరీ అయింది, మరి ఎక్కడ చోరీ ఉంది?” అంటూ కాంగ్రెస్ నాయకత్వంపై సూటి వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా, హౌసింగ్ అంశం
హైడ్రా ప్రాజెక్ట్‌లో జరిగిన వివాదాలపై వైట్ పేపర్ విడుదల చేయాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. “ఎంతమంది సంపన్నుల ఇళ్లను కూలగొట్టారో ప్రజలకు చెప్పండి” అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో జాయినింగ్స్‌పై సస్పెన్స్
“కాంగ్రెస్ పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు అనేది మీరు చూడండి. నేను చెప్పను. సినిమా చాలా ఉంది, సస్పెన్స్ కూడా చాలానే ఉంది” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను నమ్మడం అసాధ్యం అని స్పష్టం చేశారు.
డ్రగ్స్‌పై హెచ్చరిక
రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “డ్రగ్స్ చాలా డేంజరస్. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి ఇది ముప్పు” అని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కఠిన చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.
రైతుల కోసం కేంద్రమే పనిచేస్తోంది
రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించేది కేంద్రప్రభుత్వమేనని, రైతుల కోసం బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆలోచిస్తోందని రామచందర్ రావు స్పష్టం చేశారు.




